వైయస్ జగన్ ...ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎంపికైన తర్వాత సినిమా పెద్దలు ఎవరూ ఆయన్ను కలవలేదు. ఆ విషయమై అప్పుడు మీడియాలో భారీ విమర్శలు సైతం వచ్చాయి. మరో ప్రక్క అశ్వనీదత్, దిల్ రాజు లాంటి ప్రముఖులు కలుద్దామనుకున్నా అపాయింట్మమెంట్ దొరకలేదని వినిపించింది.  మరో ప్రక్కన వైసీపీలో ఉన్న ఫృధ్వీ, పోసాని మధ్య ఈ విషయమై విభేధాలు సైతం వచ్చాయి. రాజేంద్రప్రసాద్ సైతం ఈ విషయమై మీడియాతో మాట్లాడారు. ఇవన్నీ ప్రక్కన పెడితే..ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి...జగన్ ని కలవటానికి అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది.

ఇంతకూ చిరు ఆ అపాయింట్మెంట్ అడగటానికి కారణం ...ఆయన తాజా చిత్రం సైరా సక్సెస్ గురించి చెప్పాలని, అవకాసం ఉంటే ఓ షో వేసి చూపించాలని తెలుస్తోంది. అలాగే అదే సమంయలో ముఖ్యమంత్రిగా ఎంపికైనందుకు శుభాకాంక్షలుకూడా చెప్తారట. ఇక సైరా విడుదల సమయంలో స్పెషల్ షోలకు పర్మిషన్ ఇచ్చినందుకు జగన్ కు కృతజ్ఞతలు చెప్పుకోవటానికి కూడా అని తెలుస్తోంది.
 
ఇక ఈ రిక్వెస్ట్ ని ఖచ్చితంగా జగన్ ఆమోదించే అవకాసం ఉందంటున్నారు. ఎందుకంటే చిరంజీవి తో ముఖ్యమంత్రి అయ్యాక జగన్ కలిసింది లేదు. చిరంజీవిని కలవటం ద్వారా మెగా ఫ్యాన్స్ కు, ఓ సామాజిక వర్గానికి సంతోషం కలిగించే అవకాసం ఉంది. అయితే ఇప్పటిదాకా చిరు, జగన్ ల కలయికు ఇంకా  అపాయింట్మెంట్ ఫిక్స్ కాలేదు.