కింగ్ ఆఫ్ రొమాన్స్ గా పేరుగాంచిన బాలీవుడ్ లెజెండ్ రిషి కపూర్ మృతి భారత చిత్ర పరిశ్రమలో తీరని శోకాన్ని మిగిల్చింది. బుధవారం రోజు ఇర్ఫాన్ ఖాన్ మృతి.. నేడు రిషి కపూర్ మరణంతో బాలీవుడ్ కు కోలుకోలేని దెబ్బలు తగిలాయి. తోటి నటుడు మరణించడంతో సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా స్పదింస్తున్నారు. 

రిషి కపూర్ మృతిపై బిగ్ బి అమితాబ్, మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ లాంటి వారంతా తల్లడిల్లిపోతున్నారు. అమితాబ్ చేసిన ట్వీట్ ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. రిషి కపూర్ మృతికి ఆయన ఎంతగా వేదన అనుభవిస్తున్నారో అని. 

అతడు కొద్దిసేపటి క్రితమే వెళ్ళిపోయాడు.. నేను కుప్పకూలిపోయాను అని అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు. 

రిషి కపూర్ లేరనే వార్త నాలో విధ్వంసకరమైన వేదనని కలిగిస్తోంది. అద్భుతమైన నటుడు, ఎందరో హృదయాలు గెలుచుకున్న వ్యక్తి రిషి కపూర్. నా స్నేహితుడు రిషి కపూర్ కు వీడ్కోలు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. 

 

ఇది విషాదకరం.. ఇద్దరు గొప్ప నటుల్ని తక్కువ సమయంలో కోల్పోయాం. రిషి సర్ చిన్నపిల్లల తరహాలోనే కల్మషం లేని వ్యక్తి. ఆయన్ని కలసిన ప్రతి సారీ నాకో కొత్త అనుభవం దక్కుతుంది. రిషి సర్ మృతి మా కుటుంబానికి కూడా లోటే. కపూర్ కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తున్నా అంటూ వెంకటేష్ పేర్కొన్నారు. 

రిషి కపూర్ గారు లేరనే వార్త హృదయాన్ని కలచివేస్తోంది. మరో అద్భుతమైన నటుడిని ఇండియన్ సినిమా కోల్పోయింది. కపూర్ కుటుంబానికి నా సంతాపం తెలియజేస్తున్నా అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశాడు. 

హృదయం బద్దలయ్యే విషాదం.. నా ప్రియ మిత్రుడు రిషి కపూర్ ఆత్మకు శాంతి కలగాలి అని సూపర్ స్టార్ రజనీకాంత్ ట్వీట్ చేశారు. 

ఈ వారం చిత్ర పరిశ్రమలో తీవ్రమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. భర్తీ చేయలేని నష్టం.. లెజెండ్రీ రిషి కపూర్, అద్భుతమైన టాలెంట్ కలిగిన ఇర్ఫాన్ ఖాన్ ఇద్దరినీ కోల్పోయాం అని మోహన్ బాబు పేర్కొన్నారు.