కొండ సురేఖపై విరుచుకుపడ్డ స్టార్స్.. చిరంజీవి, అల్లు అర్జున్, వెంకటేశ్, సుధీర్ బాబు, మంచు లక్ష్మి ఏమన్నారంటే?
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ ప్రముఖులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, నాని. చిరంజీవి, సుధీర్ బాబు ఆమె కామెంట్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ విషయంపై స్పందించారు.
బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను(KTR) విమర్శిస్తూ తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారాయి. సినీ పరిశ్రమ ఈ విషయమై ఘాటుగా స్పందిస్తోంది. సినీ పరిశ్రమ నటులను రాజకీయాల్లోకి తీసుకుని రావటం పద్దతి కాదంటున్నారు. సమంత(Samantha) , నాగచైతన్య (NagaChaitanya) కేటీఆర్ వల్లే విడాకులు తీసుకున్నారని మీడియాతో మాట్లాడిన మాటలు వైరల్ అయ్యిన నేపధ్యంలో సినీ ప్రముఖులు అంతా స్పందిస్తున్నారు. ఇప్పటికే నాని, ఎన్టీఆర్,నాగార్జున, నటుడు అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) వంటి ప్రముఖులు స్పందించారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఆమోదనీయం కాదన్నారు. ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ తాజాగా చిరంజీవి (Chiranjeevi),అల్లు అర్జున్, వెంకటేష్, సుధీర్ బాబు, మంచు లక్ష్మీ వంటి ప్రముఖులు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
కొండా సురేఖ కామెంట్స్ పై చిరంజీవి స్పందిస్తూ..
‘‘గౌరవనీయులైన మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి నేను చాలా బాధపడ్డాను. త్వరితగతిన వార్తల్లో నిలిచేందుకు సెలబ్రిటీలు.. సినీ కుటుంబానికి చెందిన వ్యక్తులను సాఫ్ట్ టార్గెట్ చేసుకోవడం సిగ్గు చేటు. చిత్ర పరిశ్రమకు చెందిన సభ్యులపై ఇలాంటి మాటల దాడులను మేమంతా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు, మరీ ముఖ్యంగా మహిళలపై ఇలాంటి ఆరోపణలు చేసి దిగజారవద్దు. సమాజాభివృద్ధి కోసం మేము మా నాయకులను ఎన్నుకుంటాం. ఇలాంటి వ్యాఖ్యలు చేసి వారు తమ స్థాయిని తగ్గించుకోకూడదు. రాజకీయ నాయకులు, గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్నవారు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవాలి’’ అని చిరంజీవి పేర్కొన్నారు.
కొండా సురేఖ కామెంట్స్ పై మంచు లక్ష్మి స్పందిస్తూ..
‘‘ఇది చాలా నిరుత్సాహకరం. ప్రతిసారీ రాజకీయ నాయకులు సినీ పరిశ్రమకు చెందినవారిపై ఇలాంటి నిందలు వేయడం కోపం తెప్పిస్తోంది. రాష్ట్రంలో ఏదైనా భయంకరమైన సంఘటన జరిగినప్పుడు రాజకీయ నాయకులు వారి అజెండాల కోసం సినీ ప్రముఖుల నుంచి మద్దతు కోరుతారు. ఇది ఎలా న్యాయం అవుతుంది? ఇప్పుడు మేం ఎందుకు మౌనంగా ఉండాలి? ఓ మహిళ నుంచి ఇలాంటి ఆరోపణలు మరింత ఎక్కువ బాధ కలిగిస్తున్నాయి. ప్రజలకు వినోదాన్ని అందించేందుకు తమ జీవితాలను అంకితం చేసే వారిని గౌరవించండి. అంతేగానీ, ఇలా రాజకీయాల్లోకి లాగొద్దు. ఇది చాలా అన్యాయం’’ - మంచు లక్ష్మి
కొండా సురేఖ కామెంట్స్ పై సుధీర్ బాబు స్పందిస్తూ..
‘‘మంత్రి కొండా సురేఖ గారు.. మీ అమర్యాదకర, స్త్రీ ద్వేషపూరిత వ్యాఖ్యలు భయంకరంగా ఉన్నాయి. సినీ ప్రముఖులను రాజకీయ పావులుగా వాడుకోవడం మీ బుద్ధిని తెలియజేస్తోంది. ఇలాంటి వ్యూహాలకు మా మధ్య సోదరభావం బెదిరిపోదు.. బెదిరింపులకు గురికాదు. మీరు కేవలం మహిళలను అవమానించడమే కాదు.. తెలంగాణకు గర్వకారణమైన మొత్తం సినీ పరిశ్రమను అగౌరపర్చారు. ఇలాంటి విషయాల నుంచి ప్రజలను పాలించడం వైపు దృష్టి మరల్చండి. మీ గౌరవం ఇప్పటికే తగ్గిపోయింది. దానిని మరింత దిగజార్చద్దు’’ - హీరో సుధీర్ బాబు
కొండా సురేఖ కామెంట్స్ పై రాం గోపాల్ వర్మ స్పందిస్తూ..
‘‘నాగార్జున కుటుంబాన్ని అత్యంత దారుణంగా అవమానపరిచిన కొండా సురేఖ కామెంట్లకు నేను షాక్ అయ్యా. ఆమె తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకునే క్రమంలో అత్యంత గౌరవప్రదమైన నాగార్జున కుటుంబాన్ని లాగడం ఏ మాత్రం సహించకూడదు’’ - దర్శకుడు రాం గోపాల్ వర్మ
కొండా సురేఖ కామెంట్స్ పై అల్లు అర్జున్ స్పందిస్తూ..
తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ విషయంపై స్పందించారు. సినీ ప్రముఖులు, సినీ కుటుంబాలపై నిరాధారమైన కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్విటర్ వేదికగా నోట్ రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ తన నోట్‌లో ప్రస్తావిస్తూ..' సినీ ప్రముఖులు, సినీ కుటుంబాలపై నిరాధారమైన, కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆమె ప్రవర్తన చాలా అగౌరవంగా ఉంది. ఇలా మాట్లాడడం మన తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధం. ఇలాంటి బాధ్యతారహితమైన చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని నేను కోరుతున్నా' అంటూ పోస్ట్ చేశారు.
కొండా సురేఖ కామెంట్స్ పై వెంకటేష్ స్పందిస్తూ..
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో వెంకటేశ్ స్పందించారు. వ్యక్తిగత విషయాలను రాజకీయాల కోసం వాడుకోవడం చాలా బాధ కలిగించిందని తెలిపారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం వ్యక్తులను టార్గెట్ చేయడం దురదృష్టకరమన్నారు. మా సినిమా కుటుంబం పరస్పర గౌరవం, కృషితో వ్యక్తిగత జీవితాల పట్ల అపారమైన అంకితభావంతో నిర్మించబడిందని ట్వీట్ చేశారు. బహిరంగ ప్రసంగంలో తమ గౌరవాన్ని కాపాడుకోవడాల్సిన నైతిక బాధ్యత ఉందన్నారు. వ్యక్తుల జీవితాలను రాజకీయ రంగంలోకి లాగడం వల్ల ఎవరికీ ఉపయోగముండదని.. అది వారికి బాధను మాత్రమే పెంచుతుందన్నారు. ప్రజలకు నాయకత్వం వహించే స్థానాల్లో ఉన్న వ్యక్తులు సంయమనం పాటించాలని నేను కోరుతున్నానని' వెంకటేశ్ పోస్ట్ చేశారు.
కొండా సురేఖ కామెంట్స్ పై నిర్మాత స్వప్నదత్ స్పందిస్తూ..
ఓ కేబినెట్ మంత్రి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వినటం చాలా బాధాకరం. ఎలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం? - నిర్మాత స్వప్నదత్
కొండా సురేఖ కామెంట్స్ పై నాగచైతన్య స్పందిస్తూ..
‘‘జీవితంలో విడాకుల నిర్ణయమనేది అత్యంత బాధాకరమైన, దురదృష్టకర విషయాల్లో ఒకటి. ఎన్నో ఆలోచనల తర్వాత పరస్పర అంగీకారంతోనే నా మాజీ భార్య, నేను విడిపోయాం. ఎంతో పరిణితితో ఆలోచించి మా విభిన్న లక్ష్యాల కోసం ముందుకు సాగడానికి విడాకులు తీసుకున్నాం. మా విడాకులపై గతంలో అనేక నిరాధారమైన ఆరోపణలు వచ్చాయి. ఇరు కుటుంబాలపై ఉన్న గౌరవంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్నా. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమే కాకుండా హాస్యాస్పదం. ఆమె వ్యాఖ్యలు ఆమోదనీయం కాదు. సమాజంలో మహిళలకు మద్దతుతో పాటు గౌరవం దక్కాలి. సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాల నిర్ణయాలను మీడియా హెడ్ లైన్స్ కోసం ఉపయోగించుకోవడం సిగ్గుచేటు’’ అని నాగచైతన్య పేర్కొన్నారు.
కొండా సురేఖ కామెంట్స్ పై ఎన్టీఆర్ స్పందిస్తూ...
‘‘కొండా సురేఖగారు వ్యక్తిగత జీవితాలను బయటకులాగడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ. ప్రజా జీవితంలో ఉన్న మీలాంటి ముఖ్యమైన వ్యక్తులు హుందాగా, గౌరవంగా గోప్యతను పాటించేలా వ్యవహరించాలి. బాధ్యతారాహిత్యంగా చిత్ర పరిశ్రమపై నిరాధార ప్రకటనలు చేయడం నిజంగా బాధాకరం. ఇతరులు మాపై ఇలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ కూర్చొనేది లేదు. ఒకరినొకరు గౌరవించుకోవడం, పరిధులు దాటి ప్రవర్తించకుండా ఉండేందుకు ఈ అంశాన్ని కచ్చితంగా లేవనెత్తుతాం. ప్రజాస్వామ్య భారతంలో నిర్లక్ష్యపూరిత ప్రవర్తనను మన సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ హర్షించదు’’ అన్నారు.
కొండా సురేఖ కామెంట్స్ పై నాగార్జున స్పందిస్తూ..
మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్యలను నాగార్జున ఖండించారు. ‘‘గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్థులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను’’అన్నారు.
కొండా సురేఖ (konda surekha) చేసిన వ్యాఖ్యలపై సమంత (Samantha) స్పందన
‘‘నా విడాకులు వ్యక్తిగత విషయం. దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని అభ్యర్థిస్తున్నా. మహిళగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి చాలా ధైర్యం, బలం కావాలి. కొండా సురేఖ గారు.. ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నా. దయచేసి చిన్న చూపు చూడకండి. ఓ మంత్రిగా మీ మాటలకు విలువ ఉందని మీరు గ్రహించారని ఆశిస్తున్నాను. వ్యక్తుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని నేను వేడుకుంటున్నా. నా విడాకులు పరస్పర అంగీకారం, సామరస్యపూర్వకంగా జరిగాయి. ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదు. దయచేసి నా పేరును రాజకీయాలకు దూరంగా ఉంచగలరా? నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను. అలాగే ఉండాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నారు సామ్.