రీ ఎంట్రీలో మెగాస్టార్ మంచి ఫాంలో ఉన్నాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి లాంటి సూపర్‌ హిట్స్ అందుకున్న చిరు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయ్యింది. కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా షూటింగ్ ఆగిపోవటంతో ఇంటికే పరిమితమైన మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రాలను లైన్‌లో పెడుతున్నాడు. ఇప్పటికే పలువురు దర్శకులతో చర్చలు జరుపుతున్నట్టుగా వెల్లడించాడు.

ఆచార్య పూర్తయిన వెంటనే మలయాళ సూపర్‌ హిట్ సినిమా లూసిఫర్‌ను తెలుగులో రీమేక్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. సుజిత్ దర్శకుత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాలో కీలకమైన అతిథి పాత్రలో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ నటిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. మెగా ఫ్యామిలీతో సల్మాన్‌కు సన్నిహిత సంబంధాలు ఉండటంతో అంతా నిజమే అనుకున్నారు.

అయితే తాజాగా ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి స్పంధించాడు. లూసిఫర్ రీమేక్‌ కు సంబంధించి కథలో మార్పులు జరుగుతున్నాయని చెప్పిన చిరు, ఈ సినిమాలో మెగా ఫ్యామిలీ హీరోలు నటిస్తున్నారని, బాలీవుడ్‌ హీరో సల్మాన్ నటిస్తున్నడని వస్తున్న వార్తలు రూమర్స్ అని కొట్టి పడేశాడు. ప్రీ ప్రొడక్షన్‌ పనులుపూర్తయిన తరువాతే నటీనటులు ఎంపిక జరుగుతుందని చెప్పారు. దీంతో సల్మాన్‌ నటిస్తున్నాడంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చినట్టైంది.