కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా ప్రపంచమంతా ఇంటికే పరిమితమైంది. సెలబ్రిటీలు కూడా ఇళ్లలోనే ఉండటంతో ఏం చేయాలో పాలుపోక ఇంటిపనుల్లో మునిగిపోతున్నారు. ఖాళీ సమయంలో తమ గత అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే పనిలో ఉన్నారు. ఇంటి పనులు చూసుకోవటంతో పాటు ఆన్‌లైన్‌ ద్వారా మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి.

కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ కార్మికులకు సాయం అందించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్న మెగాస్టార్, భవిష్యత్తు సినిమాల విషయంలో కూడా నిర్ణయాలు తీసుకునేందుకు కసరత్తులు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాను గతంలో ఓ సూపర్‌ హిట్ సినిమాను చూసి తాను ఎలా ఫీల్‌ అయ్యాడో అభిమానులతో పంచుకున్నాడు.

చిరు సుప్రీం హీరోగా ఫుల్‌ ఫాంలో ఉన్న సమయంలోనే కమల్ హాసన్‌ హీరోగా కే విశ్వనాథ్ తెరకెక్కించిన స్వాతిముత్యం సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా చూసిన తరువాత చిరు చాలా బాధపడ్డాడట. తన జీవితంలో ఇంతగా పర్ఫామ్‌ చేసే క్యారెక్టర్‌ అసలు తనకు దక్కుతుందా అని బాధపడ్డాడట. రెండు మూడు రోజుల పాటు అదే బాధలో ఉన్నాడిపోయాడట చిరు. అయితే సమయంలో చిరు బాధను గమనించిన సుహాసిని విషయాన్ని విశ్వనాథ్‌కు తెలియజేయటంతో ఆయన చిరు కోసం స్వయంకృషిని రూపొందించినట్టుగా వెల్లడించారు.