కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రపంచ దేశాలన్నీ విలవిలలాడిపోతున్నాయి. ఈ వైరస్ భయంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. దీంతో రోజువారి కూలీలు, పేద కుటుంబాల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సినీ రంగంలోనూ ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. సినీ రంగంలోని 24 శాఖల్లో రోజూవారి కూలికి పనిచేసే వారు లక్షల సంఖ్యలో ఉన్నారు.

అలా ఇబ్బంది పడుతున్న టాలీవుడ్‌ ఫిలిం వర్కర్స్‌ను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షతన కరోనా క్రైసిస్‌ చారిటీ పేరుతో ఓ సంస్థను నెలకొల్పి దాని ద్వారా పేద కుటుంబాలను ఆదుకుంటున్నారు. ఇప్పటికే ఈ చారిటీకి పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. తాజాగా నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా తన వంతు సాయం అందించాడు.

25 లక్షల రూపాయల చెక్కును నిర్వహకులకు సీ కళ్యాణ్ ద్వారా అందజేశాడు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి కష్టసమయంలోను,ప్రజలను ఆదుకోవటం కోసం సినీ పరిశ్రమ ఒక్కటిగా ముందుకొస్తే, మీరెప్పుడు తోడుంటారు అంటూ బాలయ్యను అభినందించారు. అంతే కాదు కరోనాపై పోరాడేందుకు తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షల విరాళం ప్రకటించటంపై కూడా హర్షం వ్యక్తం చేశారు మెగాస్టార్.