తమిళ సినీ ప్రముఖులపై సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే చిన్మయి తనని వైరముత్తు లైంగికంగా వేధించాడని సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణల తర్వాత చిన్మయికి తమిళ చిత్ర పరిశ్రమ నుంచి చిక్కులు మరింతగా ఎక్కువయ్యాయి. ఆమెని డబ్బింగ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నుంచి తొలగించారు. 

అయినా చిన్మయి వెనకడుగు వేయకుండా వేధింపులపై పోరాడుతోంది. ఇటీవల కోలీవుడ్ డబ్బింగ్ యూనియన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు చిన్మయి నామినేషన్ దాఖలు చేసింది. కానీ ఆమె నామినేషన్ తిరస్కరణకు గురైంది. నటుడు రాధారవి ఎన్నికయ్యారు. చిన్మయి వేధింపు ఆరోపణలు చేస్తున్న సింగర్ కార్తీక్ కు కూడా యూనియన్ లో చోటు దక్కడం విశేషం. 

డబ్బింగ్ యూనియన్ ఎన్నికల గురించి క్లారిటీ ఇస్తూ సింగర్ మనో ఓ వీడియో విడుదల చేశారు. దీనికి కౌంటర్ ఇస్తూ సోషల్ మీడియాలో చిన్మయి కొన్ని కామెంట్స్ చేసింది. తాను సింగర్ కార్తీక్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన తర్వాత మనో నాకు ఫోన్ చేశారు. ఇంటికి రమ్మని పిలిచారు. నీ ఆరోపణల వల్ల కార్తీక్ భార్య బాధపడుతోంది. అతడి కెరీర్ నాశనం చేయకు. 

నువ్వు ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నావు. కార్తీక్ కూడా అంతే. ప్రస్తుతం అతడు మంచి పొజిషన్ లో ఉన్నాడు. దానిని పాడు చేయకు అని మనో రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. 

వృత్తి పరంగా కార్తీక్ పై నాకు గౌరవం ఉంది. ఎంతో కష్టపడి పెద్ద సింగర్ గా ఎదిగాడు. నేను కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొని గుర్తింపు సొంతం చేసుకున్నా. కానీ ఈ స్థాయికి వచ్చాక కార్తీక్ లాగా మరెవరూ చెడుగా ప్రవర్తించలేదు. వేధింపులకు గురి చేయలేదు. కార్తీక్, మనో మంచి సింగర్ కావచ్చు.. కానీ మంచి మగాళ్లు మాత్రం కాదు అని చిన్మయి సంచలన వ్యాఖ్యలు చేసింది.