ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాదకి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది నకిలీ ఫోటో అని.. చిన్మయి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇటీవల లైంగిక వేధింపులు, అత్యాచార కేసుల్లో నిందితుడైన వివాదాస్పద గురువు నిత్యానందతో చిన్మయి, ఆమె తల్లి కలిసి ఉన్న ఒక ఫోటో వైరల్ అయింది.

ఈ ఫోటోని విపరీతంగా షేర్ చేసిన నెటిజన్లు ఆమెని ప్రశ్నించడం మొదలుపెట్టారు. దీంతో ఆమె స్పందించి ఫోటోపై వివరణ ఇచ్చింది. అయినప్పటికీ నెటిజన్లు షేర్ చేయడం ఆపలేదు. దీంతో ఆమె సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేసింది.

ఈ ఫోటో మార్ఫింగ్ చేసిందని నిర్ధారించిన తరువాత కూడా ఫ్యాన్స్ ఇలా ఎందుకు చేస్తున్నారో అర్ధం కావడం లేదంటూ ట్వీట్ చేశారు. కావాలనే ఇలా చేస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసలు ఫోటోని షేర్ చేశారు. అయితే చిన్మయి ట్వీట్ చేసిన తరువాత మార్ఫింగ్ ఫోటో షేర్ చేసిన ట్విట్టర్ యూజర్ తన అకౌంట్ నుండి ట్వీట్ ని తొలగించారు. 

తమ కూతుర్లను నిత్యానంద ఆశ్రమంలో చట్టవిరుద్ధంగా నిర్భందించి వేధింపులకు గురి చేశాడంటూ ఓ కుటుంబం చేసిన ఆరోపణలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. దీంతో 'సేవ్ గర్ల్స్ ఫ్రమ్ నిత్యానంద' అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అయింది.

ఈ సమస్యపై స్పందించిన చిన్మయి.. భక్తి ముసుగులో జరుగుతున్న ఇలాంటి అక్రమాలు ఎన్నిసార్లు వెలుగులోకి వస్తున్నప్పటికీ ప్రజలు వాటిని అర్ధం చేసుకోలేక వారి మాయలో పడిపోతున్నారని కామెంట్ చేసింది.

దీనికి ప్రతిగా స్పందించిన ఓ వినియోగదారుడు నిత్యానంద నుండి చిన్మయి, ఆమె తల్లి ప్రసాదం స్వీకరిస్తున్నట్లుగా ఉన్న ఒక ఫేక్ ఫోటోని షేర్ చేయడంతో దుమారం రేగింది. తెలుగు, తమిళంతో పాటు చిన్మయి ఇతరభాషల్లో కూడా కొన్ని హిట్ పాటలు పాడింది.