కరోనా వైరస్ ప్రభావం దాదాపు అన్ని రంగాల మీద పడింది. అన్ని వ్యాపారాలు, సంస్థలు స్తంబించిపోయాయి. దీంతో వినోదరంగం మీద కూడా ప్రభావం పడింది. షూటింగ్‌లతో పాటు సినిమా కార్యక్రమాలన్ని నిలిచిపోయాయి. థియేటర్లు కూడా మూతపడ్డాయి. అయితే తాజాగా చైనాలో పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి.

ఇప్పుడిప్పుడే చైనాలోని సినిమా థియేటర్లు కూడా తెరుచుకుంటున్నాయి. దాదాపు 500 థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. అయితే గతంలోలా కాకుండా ఎన్నో ఆంక్షల మధ్య థియేటర్లకు అనుమతి ఇచ్చారు. గతంలో ఉన్నట్టుగా వందల సంఖ్యలో ప్రజలను థియేటర్లలోకి అనుమతించవద్దని ప్రభుత్వం నిబంధనలు విధించింది. అంతేకాదు థియేటర్లో ప్రజలు ఎలా మసలు కోవాలని అన్న అంశంలోనూ పలు సూచనలు చేసింది ప్రభుత్వం.

ఒకరి పక్కన ఒకరు కాకుండా ఒక సీటు తరువాత మూడు సీట్లు వదిలిపెట్టి, తరువాత సీట్లో మరొకరు కూర్చునేలా ఏర్పాట్లు చేయాలని థియేటర్ల యాజమాన్యాలకు సూచించారు. అంతేకాదు ప్రతీ షో పూర్తయిన తరువాత థియేటర్‌ను పూర్తి స్థాయిలో శానిటైజ్‌ చేయాలని, వరుసగా షోస్‌ వేయకుండా లిమిటెడ్‌గా షోస్‌ వేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం అనుమతించిన ప్రజలు మాత్రం ఇప్పడప్పుడే థియేటర్ల వైపు అడుగు వేసేలా లేరు.