స్టార్ హీరో విజయ్ ఇంట్లో బాంబు పెట్టినట్లు బెదిరింపులు రావడంతో చెన్నై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి పోలీసులకు బెదిరింపు కాల్ రావడంతో పోలీసులు హుటాహుటిన బయలుదేరి విజయ్ నివాసం వద్ద భద్రత ఏర్పాటు చేశారు. 

శాలిగ్రామంలో ఉన్న విజయ్ నివాసంలో బాంబు పెట్టారని, మరికొంత సమయంలో అది పేలుతుందని బెదిరింపులు వచ్చాయి. ప్రస్తుతం ఆ ఇంట్లో విజయ్ తల్లిదండ్రులు చంద్రశేఖర్, శోభ ఉంటున్నారు. విజయ్, సంగీత దంపతులు, వారి పిల్లలు ఈస్ట్ కోస్ట్ రోడ్ లో ఉన్న మరో నివాసంలో ఉంటున్నారు. 

ప్రస్తుతం విజయ్ నివాసం వద్ద పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. అదే సమయంలో అజ్ఞాత వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి ఫోన్ చేశాడు అనే విషయాలు తెలుసుకునేందుకు విచారణ చేపడుతున్నారు. సైబర్ క్రైం కింద కేసు నమోదైంది. 

విజయ్ గత కొన్నేళ్లుగా నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఊహకందని విధంగా విజయ్ క్రేజ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. విజయ్ తమిళనాడులో పొలిటికల్ గా కూడా హాట్ టాపిక్ గా మారుతున్నాడు. తమిళనాడు ప్రభుత్వానికి, విజయ్ కు మధ్య కోల్డ్ వారే జరుగుతోంది. విజయ్ రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్ కూడా పెరుగుతోంది. 

అదే విధంగా విజయ్ అభిమానులకు, ఇతర హీరోల ఫ్యాన్స్ ను నిత్యం సోషల్ మీడియాలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. విజయ్ ఇంటికి వచ్చిన బాంబు బెదిరింపు కాల్ నిజమేనా లేక ఎవరైనా ఆకతాయి చేశాడా అనేది తేలాల్సి ఉంది.