వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ గద్దలకొండ గణేష్. క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ చిత్రంలో వరుణ్ ని డిఫెరెంట్ లుక్ లో ప్రజెంట్ చేశాడు. వరుణ్ తేజ్ నటన, లుక్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. వరుణ్ తేజ్ సరసన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. 

తమిళ సూపర్ హిట్ చిత్రం జిగర్తాండకు రీమేక్ గా గద్దలకొండ గణేష్ చిత్రాన్ని రూపొందించారు. తమిళంలో బాబీ సింహా నటించిన విలన్ రోల్ ని తెలుగులో వరుణ్ తేజ్ పోషించాడు. కాకపోతే హరీష్ కొన్ని మార్పులు చేసి వరుణ్ పాత్రని హైలైట్ చేశాడు. ఈ చిత్రంలో తమిళ నటుడు అథర్వ అవకాశాల కోసం ప్రయత్నించే వర్ధమాన దర్శకుడిగా నటించాడు. 

అథర్వ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. తమిళంలో అథర్వ అనేక చిత్రాల్లో నటించాడు. తాజాగా అథర్వపై ఓ తమిళ నిర్మాత చీటింగ్ కేసు నమోదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. తమిళ నిర్మాత మథియలాగన్ అథర్వపై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. 

గత ఏడాది అథర్వ సీమ బోధ అగాధ అనే చిత్రంలో నటించాడు. ఆ చిత్రానికి నిర్మాత కూడా అథర్వనే. ఈ చిత్ర పంపిణి హక్కులని తాను దాదాపు 6 కోట్లకు దక్కించుకున్నట్లు  మథియలాగన్ తెలిపారు. కానీ ఆ చిత్రం తీవ్ర నష్టాలని మిగిల్చింది. దీనితో తన కోసం మరో సినిమా చేస్తానని అథర్వ తెలిపాడని, ఆమేరకు తమ మధ్య అగ్రిమెంట్ కుదిరిందని  మథియలాగన్ అంటున్నారు. 

తాను నిర్మించే చిత్రానికి మిన్నల్ వీరన్ అనే టైటిల్ కూడా ఖరారైందని  మథియలాగన్ అంటున్నారు. కానీ షూటింగ్ కు మాత్రం అథర్వ సహకరించడం లేదు. తన సినిమాలు తాను చేసుకుంటూ ఈ మూవీని పట్టించుకోవడం లేదు . అందుకే చీటింగ్ కేసు నమోదు చేసినట్లు  మథియలాగన్ మీడియాకు తెలిపారు.