హీరోగా కెరీర్ మొదలెట్టి, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఇప్పటికీ తన ప్రస్దానం కొనసాగిస్తున్న నటుడు చంద్రమోహన్. ఏ పాత్రని అయినా అవలీలగా అవపోసిన పట్టి, ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసే ఆయనకు ఆ తరం నుంచి ఈ తరం దాకా అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆయనకు చాలా మంది స్టార్స్ లాగే కొన్ని చిత్రమైన నమ్మకాలు, సెంటిమెంట్స్ ఉన్నాయి.  1982 నాటి విజయ చిత్ర మాస పత్రికలో ఆ నమ్మకాలను షేర్ చేసుకున్నారు. వాటిని ఆయన మాటల్లోనే చూద్దాం....

చంద్రమోహన్ మాట్లాడుతూ... దక్షిణ  దిశకు అభిముఖంగా ఉన్న ఇల్లు మంచి చేస్తుందనేది నా నమ్మకం. నేను ఇల్లు కట్టించుకునేటప్పుడు ఆ విషయంలో జాగ్రత్త తీసుకున్నాను. అలా లేని ఇళ్లలో నేను నివసించినప్పుడల్లా ఏదో ఒకరకమైన సమస్యలను ఎదుర్కోవలసి ఉండేది. అందువల్లే నాకా నమ్మకం ఏర్పడింది. అలాగే, మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ నేను డబ్బు ఇచ్చే పరిస్దితి ఏర్పడకుండా జాగ్రత్త పడుతూ ఉంటాను. శుభప్రదమైన ఆ రోజుల్లో ధనలక్ష్మీ మన ఇంటికి రావాలే కానీ, మనం ధనాన్ని ఇవ్వకూడదనేది చిన్నప్పటి నుంచీ నాకు అలవాటైపోయిన సెంటిమెంట్  అని చంద్రమోహన్ చెప్పుకొచ్చారు.

తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన చంద్రమోహన్.. 1966లో రంగులరాట్నం చిత్రంతో ఆరంభించారు.
అప్పటినుండి సహనాయకుడిగా, నాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు.
ముఖ్యంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండే పాత్రలు చేసారు.
 
చంద్రమోహన్ సంపాదించినది సంపాదించినట్లే మద్రాస్ లో స్థలాలు....హైదరాబాద్ లో కూడా ఆస్తులు....బాగానే కూడబెట్టారు. ఇండస్ట్రీ లో మహామహులు సంపాదించినదంతా ఎలా పోగొట్టుకున్నారో..ప్రత్యక్షంగా చూశారు. అందుకే ...మరీ జాగ్రత్త పడ్డానంటారు ఆయన . అలాగే క్రొత్త హీరోయన్‌లకు లక్కీ హీరోగా చంద్రమోహన్‌ను పేర్కొంటారు.ఏ హీరోయిన్ అయినా చంద్రమోహన్ ప్రక్కన నటిస్తే టాప్ పొజిషన్ లోకెళ్ళిపోతారని ఓ నమ్మకం. అది నిజం కూడా!వాణిశ్రీ, జయప్రద,తాళ్ళూరి రామేశ్వరి, సులక్షణ....ఇలా జాబితా పెద్దదే ఉంది మరి! సిరిసిరిమువ్వలో జయప్రద, పదహారేళ్ళ వయసులో శ్రీదేవి తమ నటజీవితం ప్రాంభంలో చంద్రమోహన్‌తో నటించి తరువాత తారాపధంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు.