మంచి బజ్ తో చాణక్య చిత్రం దసరా కానుకగా శనివారం రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరో గోపీచంద్ నుంచి వస్తున్న యాక్షన్ చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో గోపీచంద్ రా(Raw) ఏజెంట్ పాత్రలో నటిస్తున్నాడు. 

ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. పాకిస్తాన్ కరాచీ నేపథ్యంగా రా ఏజంట్ నిర్వహించే సీక్రెట్ మిషన్ గా దర్శకుడు తిరు ఈ చిత్ర కథని రూపొందించారు. సీనియర్ నటుడు నాజర్ కీలక పాత్రలో నటించారు. చాణక్య చిత్రం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగనున్నట్లు తెలుస్తోంది. 

ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల కొద్దిసేపటి క్రితమే చాణక్య చిత్రాన్ని వీక్షించారు. సినిమా చూసిన అనంతరం సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని తెలియజేశారు. 'కొద్దిసేపటి క్రితమే చాణక్య చిత్రాన్ని చూశా.. కథ చాలా గ్రిప్పింగ్ గా ఉంది. స్పై థ్రిల్లర్ చిత్రాల్లో అద్భుతంగా తెరకెక్కించిన డిఫెరెంట్ మూవీ ఇది. 

ఏజెంట్ పాత్రలో గోపీచంద్ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఈ చిత్రంలో చూడొచ్చు. సినిమాటోగ్రఫీ స్క్రీన్ పై కన్నులపండుగలా ఉంది. శ్రీచరణ్ ఈ చిత్రాన్ని అద్భుతమైన బ్యాగ్రౌండ్ సంగీతం అందించాడు. 

దర్శకుడు తిరు బ్రిలియంట్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నా స్నేహితుడు అనిల్ సుంకర నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. చాణక్య చిత్రం అతిపెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా' అని శ్రీను వైట్ల సోషల్ ట్వీట్ చేశారు. 

బాక్సాఫీస్ బరిలో సైరా చిత్రం ఉన్నప్పటికీ దసరా సెలవులు కావడంతో ప్రేక్షకుల ఆదరణ ఉంటుందని నిర్మాతలు చాణక్య చిత్రాన్ని అక్టోబర్ 5న రిలీజ్ చేస్తున్నారు.