బాలీవుడ్ నటి పాయల్ రోహత్గి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. నెహ్రూ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, దానికి సంబంధించిన వీడియోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడమే దీనికి కారణమని తెలుస్తోంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. గత నెల 21న పాయల్ మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తల్లితండ్రులతో పాటు ఆయన భార్య గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో చర్మేష్ శర్మ అనే కాంగ్రెస్ కార్యకర్త పాయల్ పై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు.

ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ.. 'పాయల్.. జవహర్ లాల్ నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూతో పాటు ఆయన భార్య, తల్లిని కూడా అవమానిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారని.. లాల్ బహదూర్ శాస్త్రి మరణం గురించి కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని' అన్నారు. విదేశాలు.. మన దేశం గురించి తప్పుడు అభిప్రాయం ఏర్పరచుకునే విధంగా ఈ వీడియో ఉందని.. పాయల్ మాజీ ప్రధానులను అవమానించడమే కాకుండా దేశ ప్రతిష్టతకు భంగం కలిగించే రీతిలో అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు.

అందుకే ఆమె మీద పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పాయల్ పలు టీవీ రియాలిటీ షోల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అలానే కొన్ని బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించింది. పదేళ్ల క్రితం బిగ్ బాస్ షోలో కూడా పాల్గొంది.