సినీ నిర్మాత బండ్ల గణేష్ పై కేసు నమోదైంది. ప్రముఖ సినీ నిర్మాత పీవీపీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో బండ్ల గణేష్ తో పాటు అతడి అనుచరులపై కేసు పెట్టారు. వివరాల్లోకి వెళితే.. 'టెంపర్' సినిమాకి సంబంధించి సినీ ఫైనాన్షియర్, సహ నిర్మాత పొట్లూరి వరప్రసాద్.. బండ్ల గణేష్ కి రూ.30 కోట్లు పెట్టుబడి పెట్టారు.

సినిమా విడుదల సమయంలో అసలు మొత్తాన్ని చెల్లించి, మిగిలిన దానికి బండ్ల గణేష్ చెక్కులు అందించారు. మిగిలిన డబ్బులు చెల్లించాలంటూ బండ్ల గణేష్ ను పీవీపీ కోరారు. దీంతో గణేష్ కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు పీవీపీ ఇంటికి వెళ్లి అతనిపై బెదిరింపులకు పాల్పడ్డారు.

దీంతో శుక్రవారం రాత్రి పీవీపీ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. గణేష్ తో పాటు అతని అనుచరులపై ఐపీసీ 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనపై కేసు నమోదైన విషయం తెలుసుకున్న బండ్ల గణేష్ పరారీలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

గతంలో కూడా బండ్ల గణేష్ పై ఇలాంటి కేసులు పెట్టారు. కమెడియన్ గా సినీ కెరీర్ మొదలుపెట్టిన ఆయన నిర్మాతగా టర్న్ తీసుకొని భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించారు. ఇప్పుడు మరోసారి నటుడిగా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. 

ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తోన్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో బండ్ల గణేష్ కమెడియన్ పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.