కరోనాకు చిన్న పెద్ద తేడా లేదు. సామాన్యుడు సెలబ్రిటీ అన్న తారతమ్యం లేదు. ఈ మహమ్మారి దెబ్బకు అంతా సమానమైపోయారు. భయంతో బిక్కచచ్చిపోతున్నారు. పని వాళ్లు రాక సెలబ్రిటీలు కూడా ఇంటి పనికే పరిమితమవుతున్నారు. పెద్ద పెద్ద స్టార్లు ఈ లాక్ డౌన్‌ కాలాన్ని సరదా సరదాగా గడిపేస్తుంటే మరికొందరు పనుల్లో మునిగిపోతున్నారు. ప్రకాష్ రాజ్‌ లాంటి వారు పొలం పనిలో తలమునకలవుతుంటే, మరికొందరు కుల వృత్తుల్లో మునిగిపోతున్నారు.

ఇటీవల కేజీఎఫ్ చిత్ర సంగీత దర్శకుడు రవి బస్రూర్‌ తన సొంత ఊరిలో నగలు తయారుచేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా అలాంటి సంఘటనే టాలీవుడ్‌ లోనూ జరిగింది. టాలీవుడ్‌ బర్నింగ్ స్టార్‌ సంపూర్ణేష్ బాబు, లాక్‌ డౌన్‌ కారణంగా సొంత ఊరిలో ఉండిపోవటంతో కంసాలిగా మారిపోయాడు. 

`రాజు పేద తేడా లేదు... నీ ఆస్తి, డబ్బు నీ వెనక రావు.. నువ్వెక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు గుర్తు చేసుకుంటున్న సమయం ఇది... మా ఆవిడ కోసం, పిల్లల కోసం నా పాత "కంశాలి"వృత్తి ని గుర్తు చేసుకుంటూ ఇంట్లో మిగిలిన గజ్జెలతో, తనకి కాలి మెట్టెలు, పిల్లల కోసం గజ్జెలు చేయించి ఇచ్చాను
#BetheREALMAN

సదా మీ ప్రేమకి బానిస
మీ సంపూర్ణేష్ బాబు` అంటూ తన ఫేస్‌ బుక్ పేజ్‌లో తాను కంసాలి పనిచేస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు సంపూ. హృదయ కాలేయం సినిమాతో సెన్సేషన్‌ సృష్టించిన సంపూర్ణేష్ బాబు తరువాత పలు చిత్రాల్లో హీరోగా, సపోర్టింగ్‌ రోల్స్‌లో నటించాడు.