టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా వెలుగొందాడు బ్రహ్మానందం. తెరపై ఆయన కనిపిస్తే నవ్వని ఆడియన్స్ ఉండేవారు కాదు. ఒకానొక దశలో ఆయన కాల్షీట్స్ కోసం స్టార్ హీరోలు కూడా ఎదురుచూసిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నో సినిమాల విషయాలు అందుకోవడంలో కీలకపాత్ర పోషించాడు బ్రహ్మీ..

అలాంటిది ఇటీవల కాలంలో ఆయన అసలు కనిపించడం లేదు. ఒకవేళ కనిపించిన అది కూడా ఒకట్రెండు సన్నివేశాలకే పరిమితమయ్యేవారు. ప్రస్తుతం టాలీవుడ్ లో యువ కమెడియన్ల జోరు పెరగడంతో బ్రహ్మీకి అవకాశాలు కూడా తగ్గాయి. ఇప్పటివరకు మనల్ని నవ్వించిన బ్రహ్మానందం ఇప్పుడు ఏడిపించడానికి రెడీ అవుతున్నాడు.

దర్శకుడు కృష్ణ వంశీ రూపొందిస్తోన్న 'రంగమార్తండా' అనే సినిమాలో బ్రహ్మానందం ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇందులో బ్రహ్మీ రోల్ రెగ్యులర్ గెటప్ లకు భిన్నంగా ఉండనుందని తెలుస్తోంది. తాజాగా కృష్ణవంశీ బ్రహ్మీ లుక్ ఎలా ఉండబోతుందో సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.

అంతేకాదు.. సినిమాలో బ్రహ్మీ పాత్ర ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే విధంగా ఉంటుందని.. ఆయన ఈ సినిమాలో నటించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఈ సినిమా మరాఠీలో వచ్చిన 'నటసామ్రాట్' అనే సినిమాకి రీమేక్.

ఈ సినిమాలో ప్రకాష్‌రాజ్‌, రమ్యకృష్ణలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. నటన నుండి విశ్రాంతి తీసుకున్న ఓ స్టేజ్ ఆర్టిస్ట్ విషాదకర జీవితమే ఈ సినిమా. అభిషేక్ జవకర్, మధు కలిపు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.