తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల పోషించి , తనకు  తానే సాటి అని నిరూపించుకున్న హాస్య నటుడు బ్రహ్మానందం. ఆయన మన తెలుగు రాష్ట్రాల్లో, కొద్దిగా తమిళనాట ఫేమస్ అన్నది అందరికీ తెలిసిందే. అయితే ఆయన కర్ణాటకలో కూడా ఓ రేంజిలో  అభిమానులని సంపాదించుకున్నారని రీసెంట్ గా జరిగిన ఓ సంఘటన ప్రూవ్ చేసింది.

తాజాగా  బ్రహ్మానందం కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌ నియోజకవర్గ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ కె. సుధాకర్ తరఫున బ్రహ్మానందం వీరసంద్ర ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు.  బ్రహ్మానందం రోడ్ షోతో చిక్కబళ్లాపురం రోడ్లు కిక్కిరిసిపోయాయి. ఇప్పుడు సుధాకర్ ను గెలిపించాలని ఎన్నికల ప్రచారం కోసం ఇక్కడి వచ్చాను, విజయోత్సవం రోజు మళ్లీ ఇక్కడకు వస్తానని బ్రహ్మానందం స్థానికులకు చెప్పారు.

బ్రహ్మానందం రావడంతో పెద్ద ఎత్తున ఆయన అభిమానులు తరలివచ్చారు. బ్రహ్మీతో సెల్ఫీ దిగేందుకు జనం ఎగబడటంతో ఆయన క్రేజ్ ఎంత ఉందో అర్దమైంది. బ్రహ్మానందాన్ని చూసేందుకు  పెద్ద ఎత్తున జనం రావడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్‌ అయింది.  

ఇక బ్రహ్మానందం జిందాబాద్ అంటూ తెలుగు ప్రజలు ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. చిక్కబళ్లాపురం ప్రధాన రహదారుల్లో బ్రాహ్మానందం రోడ్ షోకు పూలు చల్లి, హారతులు పట్టి స్వాగతం పలికారు.

తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న చిక్కబళ్లాపురంలో అధికారికంగా కన్నడ మాట్లాడినా అధిక శాతం మంది ప్రతిరోజూ తెలుగులోనే మాట్లాడుకోవటం విశేషం. దాంతో గతంలో ఎలక్షన్ ప్రచారం కోసం చిరంజీవి, పవన్ కళ్యాణ్ సైతం ఇక్కడకు వచ్చారు.