బోయపాటి తాను తెరకెక్కించిన తొలి చిత్రం భద్రతోనే చిత్ర పరిశ్రమ మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నాడు. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. ఇక బోయపాటి టాలీవుడ్ లో వెనుదిరిగి చూసుకోలేదు. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వరుస విజయాలు అందుకున్నాడు. 

బోయపాటి దర్శకత్వంలో భద్ర, తులసి, సింహా, లెజెండ్, సరైనోడు లాంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కాయి. కానీ ఈ ఏడాది బోయపాటి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో వచ్చిన వినయ విధేయ రామ చిత్రం దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ చిత్రంతో బోయపాటిపై విమర్శలు వెల్లువెత్తాయి. 

డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో రాంచరణ్, కియారా అద్వానీ జంటగా నటించారు. స్నేహ, ప్రశాంత్ కీలక పాత్రల్లో మెరిశారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటించడం విశేషం. భారీ అంచనాల నడుమ సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. 

ప్రస్తుతం బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ హీరోగా హ్యాట్రిక్ చిత్రానికి రెడీ అవుతున్నాడు. త్వరలో ఈ చిత్రం ప్రారంభం కానుంది. మిర్యాలగూడా రవీంద్ర ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ లో నిర్మించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ చిత్రంలో బోయపాటి శ్రీను రెమ్యునరేషన్ పై వినయ విధేయ రామ చిత్ర ప్రభావం పడ్డట్లు తెలుస్తోంది. 

బాలయ్య సినిమా కోసం బోయపాటి తన రెమ్యునరేషన్ ని దాదాపు సగం తగ్గించుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. వినయ విధేయ రామ వరకు బోయపాటి 15 కోట్ల వరకు పారితోషికం అందుకునేవారట. కాగా త్వరలో రూపొందించబోయే బాలయ్య మూవీకి బోయపాటి రెమ్యునరేషన్ 8 కోట్లు మాత్రమే అని వార్తలు వస్తున్నాయి. 

ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ రచిత రామ్ బాలయ్య సరసన హీరోయిన్ గా నటించాబోతున్నట్లు తెలుస్తోంది. విలన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ తో సంప్రదింపులు జరుపుతున్నారట.