జనసేనాని పవన్ కళ్యాణ్ త్వరలో కెమెరా ముందుకు రానున్నారు. అజ్ఞాతవాసి చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ వెండితెరకు దూరమైన సంగతి తెలిసిందే. జనసేన పార్టీ, పలు రాజకీయ కార్యక్రమాల కారణంగా పవన్ సినిమాలకు దూరంగా ఉన్నారు. 

హిందీలో ఘనవిజయం సాధించిన పింక్ చిత్ర తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటించబోతున్న సంగతి తెలిసిందే. యువ దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని తెరక్కించబోతున్నాడు. డిసెంబర్ లో ఈ చిత్రం ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

బాలీవుడ్ నిర్మాత బోనికపూర్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ఇటీవల బోనీ కపూర్ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందీలో ఘనవిజయం సాధించిన పింక్ చిత్రాన్ని సౌత్ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే అనుమానం ఉండేది. కానీ అజిత్ హీరోగా తమిళంలో ఈ చిత్రాన్ని రీమేక్ చేశాం. అక్కడ కూడా ప్రేక్షకులు ఈ కథకు బ్రహ్మరథం పట్టారు. 

నెర్కొండ పార్వాయ్ చిత్రం నాలో నమ్మకాన్ని పెంచింది. అప్పుడే పవన్ హీరోగా తెలుగులో పింక్ ని రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నట్లు బోనీ కపూర్ తెలిపారు. 

ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి చిత్రమే పవన్ చివరగా నటించిన మూవీ. ఆ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. హిందీ పింక్ చిత్రంలో బిగ్ బి అమితాబ్, తాప్సి ప్రధాన పాత్రల్లో నటించారు.