తమిళ స్టార్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. చెన్నై ఇంజంబక్కంలో ఉంటున్న ఆయన ఇంటిలో బాంబు వుందంటూ శనివారం ఓ అజ్ఞాత వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు.

పోలీసులు మరిన్ని వివరాలు అడిగేలోపే ఫోన్ కట్ అయ్యింది. దీంతో ఉలిక్కిపడిన పోలీసులు వెంటనే బాంబు స్క్వాడ్‌తో అజిత్ ఇంటికి పరుగులు పెట్టారు. దాదాపు రెండు గంటలుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఈ ఫోన్ కాల్ తమిళనాడులోని విల్లుపురం జిల్లా నుంచి వచ్చిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. కాగా ఇదే నెలలో ప్రముఖ నటులు విజయ్, రజనీకాంత్ ఇళ్లకు కూడా గుర్తు తెలియని వ్యక్తులు బాంబు బెదిరింపు కాల్స్ చేశారు. అయితే పోలీసుల దర్యాప్తులో ఇవన్నీ బూటకపు కాల్స్‌గా తేలింది.

కాగా గతంలోనూ అజిత్ ఇంటికి ఇలాగే బెదిరింపు కాల్ వచ్చింది. తాళ 55 షూటింగులో అజిత్ బిజీగా ఉన్న సమయంలో.. ఓ వ్యక్తి ఫోన్ చేసి ఆయన ఇంట్లో బాంబు ఉందని బెదిరించాడు. దీంతో బాంబు స్క్వాడ్ అజిత్ ఇంటికి చేరుకుని, అక్కడ అణువణువూ గాలించింది. అయితే, ఇది ఆకతాయిల పనిగా పోలీసులు తేల్చారు.