సౌత్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న హీరో మహేష్ బాబు. మహేష్ లుక్స్ కి బాలీవుడ్ లో సైతం అభిమానులు ఉన్నారు. చాలా రోజులుగా మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఆ దిశగా అడుగులు మాత్రం పడడం లేదు. 

ఈ ఏడాది మహేష్ బాబు మహర్షి చిత్రంలో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నాడు. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంలో మహేష్ బాబుని వంశీ కార్పొరేట్ సంస్థ సీఈవోగా అద్భుతంగా చూపించాడు. మహర్షిసూపర్ హిట్ కావడంతో మహేష్ వంశీపైడిపల్లికి మరో అవకాశం ఇచ్చాడు. వీరిద్దరి కాంబినేషన్ లో త్వరలో మరో చిత్రం తెరకెక్కనుంది. 

ప్రస్తుతం వంశీ.. మహర్షి చిత్రాన్ని మించేలా మంచి కథని సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ ని దిల్ రాజు నిర్మించేందుకు ఆసక్తి చూపుతునట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా మహేష్ బాబుని బాలీవుడ్ కు పరిచయం చేసేందుకు గతంలో కూడా కొన్ని సంస్థలు ప్రయత్నించాయి. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. తాజాగా మరో బడా సంస్థ సోనీ పిక్చర్స్ మహేష్ చిత్రంపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. 

ఈ చిత్ర నిర్మాణంలో భాగమయ్యేందుకు సోనీ సంస్థ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. మహేష్ 27వ చిత్రాన్ని వంశీ డైరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మహేష్ మూవీతో సోని సంస్థ కూడా చేతులు కలిపితే ఇక తిరుగుండదు. బాలీవుడ్ లో కూడా ఈ ప్రాజెక్ట్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాథమిక దశలోనే ఉన్న ఈ క్రేజీ కాంబినేషన్ గురించి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.