సీనియర్‌ బాలీవుడ్‌ నటి, లెజెండరీ యాక్ట్రస్‌ నిమ్మి (80)  అనారోగ్య కారణాలతో మృతి చెందారు. కొంతకాలం అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆమె బుధవారం తుదిశ్వాస విడిచినట్టుగా వెల్లడించారు. కుటుంబ సభ్యులకు తెలిపిన వివరాల ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా ఆమె ఆరోగ్య సమస్యలతో తరుచూ ఆసుపత్రిలో చేరుతున్నారని, ఆమె జ్ఞాపకశక్తి కూడా పూర్తిగా మందగించిందని వెల్లడించారు. ఈ మధ్య ఆరోగ్యం పూర్తిగా క్షీణించటంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చినట్టుగా ఆమె కోడలు వెల్లడించారు.

బ్లాక్‌ వైట్‌ కాలంగా టాప్‌ స్టార్‌గా ఓ వెలుగు వెలిగిన లెజెండరీ నటి నిమ్మి.. బర్సాత్‌, ఆన్‌, ఉడాన్‌ ఖటోల, బసంత్‌ బహార్‌, మేరే మెహబూబా, లవ్‌ అండ్ గాడ్‌ లాంటి సూపర్‌ హిట్ సినిమాల్లో నటించారు. అలనాటి టాప్ స్టార్స్‌ దిలీప్‌ కుమార్, దేవ్‌ ఆనంద్‌, రాజ్‌ కుమార్ లాంటి టాప్‌ స్టార్స్‌తో కలిసి తెరను పంచుకున్నారు నిమ్మి.

1949 నుంచి 1965 వరకు ఆమె బాలీవుడ్‌ లో టాప్ స్టార్‌గా ఎదిగారు. బర్సాత్ సినిమాతో బాలీవుడ్‌ వెండితెరకు పరిచయం అయిన ఆమె తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమా 
సూపర్‌ హిట్ కావటంతో ఆమె స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయారు. చివరగా 1986లో రిలీజ్ అయిన లవ్ అండ్ గాడ్ సినిమాల నటించారు నిమ్మి. తన కాలంలో ప్రముఖ రచయిత అలి రజాను నిమ్మి వివాహం చేసుకున్నారు. అలి రజా 2007లో మరణించారు. ఆమె మృతి పట్ల పలువురు బాలీవుడ్‌ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.