ప్రస్తుతం కరోనా భయంతో ప్రపంచమంతా ఇంటికే పరిమితమైంది. ఒక మనిషి మరో మనిషిని తాకడానికి కూడా భయపడుతున్న ఈ తరుణంలో డాక్టర్లు, శానిటేషన్‌ కార్మికులు, పోలీసులు మాత్రం తమ ప్రాణాలకు తెగించి ప్రజల కోసం పని చేస్తున్నారు. ప్రజారోగ్యం కోసం వారు తమ ప్రాణాలను సైతం లుక్క చేయకుండా పోరాడుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అక్కడక్కడా డాక్టర్లు, పోలీసుల మీద దాడులు జరుగుతున్న సంఘటనలు ఆందోళన  కలిగిస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు తరుచూ వినిపిస్తుండటంపై బాలీవుడ్ స్టార్ హీరో అజయ్‌ దేవగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. `అభ్యంతరకరంగా, ఆగ్రహంగా ఉంది. చదువుకున్న వారు కూడా వైద్యుల మీద దాడులు చేస్తున్న వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. అసంబద్ధమైన అనుమానాలతో డాక్టర్ల  పై దాడులు చేయటం దారుణం. ఇలాంటి దుర్మార్గాలు చేసే వారే అసలైన నేరస్తులు` అంటూ తన ట్విటర్‌ పేజ్‌లో పోస్ట్ చేశాడు అజయ్ దేవగన్‌.

అంతేకాదు ఆయన ప్రజలంతా ఇంట్లోనే ఉండాలని కోరాడు. కరోనాపై భారత్‌ చేస్తున్న యుద్ధలో విజయం సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇప్పటికే కరోనాపై పోరాటానికి తనవంతు సాయంగా 51 లక్షల విరాళం ప్రకటించాడు అజయ్‌ దేవగన్‌. లాక్ డౌన్‌ కారణంగా షూటింగ్ లు నిలిచిపోవటంతో పూట గడవని సినీ కార్మికుల కోసం ఈ డబ్బును ఖర్చ చేయాలని కోరాడు అజయ్ దేవగన్‌.