ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనుభవ్ సిన్హా బూతులు తిడుతూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. నటి తాప్సి ప్రధాన పాత్రలో నటించిన 'తప్పడ్' సినిమాకి అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించారు.

రెండు వారాల క్రితం సినిమా రిలీజైంది. ఇందులో తాప్సి గృహిణి పాత్రలో నటించింది. కథ ప్రకారం సినిమాలో తన భర్త చెంపపై కొడతాడు. దీంతో ఆమె విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతుంది. ఆ తరువాత ఏం జరిగిందనేది కథ. ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

కానీ ఓ వెబ్ సైట్ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ ని తక్కువ చేస్తూ ప్రేక్షకులు 'తప్పడ్' సినిమాకి చెంప పగిలేలా సమాధానమిచ్చారు అంటూ  ఇష్టమొచ్చినట్లు రాయడంతో అనుభవ్ సిన్హా ఆగ్రహానికి లోనయ్యారు.

సదరు వెబ్ సైట్ ని ఉద్దేశిస్తూ.. 'ఈ బాస్టర్డ్స్ సినిమాని వ్యభిచారంలా మార్చేస్తున్నారు. నా డబ్బు, నా సినిమా, నా లాభాలు, నా నష్టాలు.. మధ్యలో మీరెవరు..? నేను మీకేమైనా షేర్స్ ఇచ్చానా..? లేక నా నుండి మీరేమైనా కొనుక్కున్నారా..? ముందు సినిమా చూడండి.. మీకు నచ్చిందా..? లేదా అనేది మీ ఇష్టం' అంటూ ఘాటు పదజాలాన్ని వాడారు. అయితే వాడిన పదజాలం ఆడవారిని తక్కువ చేస్తూ ఉండడంతో చాలా మంది మహిళలు ఆయన్ని విమర్శించారు.

దాంతో అనుభవ్ ట్విట్టర్ ద్వారా సారీ చెప్పారు. సినిమా గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే తట్టుకోలేక.. అలా మాట్లాడానని తనను క్షమించాలని మహిళలను, పెద్దలను, పిల్లలను కోరారు.