ముంబై: ప్రముఖ హిందీ నటుడు రిషీ కపూర్ ముంబైలోని ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆయన సోదరుడు రణధీర్ కపూర్ చెప్పారు. 67 ఏళ్ల రిషీ కపూర్ ను బుధవారం ఉదయం హెచ్ఎన్ రిలయన్స్ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకుని వెళ్లారు. 

రిషి కపూర్ ఆస్పత్రిలో చేరారని, ఆయన క్యాన్సర్ తో బాధఫడుతున్నారని, శ్వాస తీసుకోవడం ఇబ్బంది రావడంతో ఆస్పత్రికి తీసుకుని వచ్చినట్లు, ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని రణధీర్ కపూర్ చెప్పారు. 

 రిషీ కపూర్ అమెరికాలో ఏడాది పాటు క్యాన్సర్ కు చికిత్స తీసుకున్న తర్వాత సెప్టెంబర్ లో ఇండియాకు వచ్చారు. ఫిబ్రవరిలో రెండు సార్లు ఆస్పత్రిలో చేరారు. కుటుంబ వేడుకకు హాజరైనప్పుడు ఢిల్లీలో మొదటిసారి ఆస్పత్రిలో చేరారు. ఆ సమయంలో ఆయన ఇన్ ఫెక్షన్ తో బాధపడ్డారు. 

ముంబైకి తిరిగి వచ్చిన తర్వాత వైరల్ ఫీవర్ తో ఆస్పత్రిలో చేరారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ వస్తున్న రిషీ కపూర్ ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఏ విధమైన పోస్టులు కూడా పెట్టడం లేదు. దీపీక పడుకొనేతో ది ఇంటర్న్ సినిమా తీస్తానని ఆయన ఇటీవలే ప్రకటించారు.