నీది నాదీ ఒకే కథ చిత్రంలో అందరి ప్రశంసలు అందుకున్న దర్శకుడు వేణు ఊడుగుల తదుపరి చిత్రంగా ‘విరాటపర్వం’చేస్తున్న సంగతి తెలిసిందే. 1990ల నాటి నక్సలిజం నేపథ్యం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రానా, సాయి పల్లవిలు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంభందించి ఓ ఆసక్తికరమైన విశేషం బయిటకు వచ్చింది.

ఈ సినిమాలో నక్సల్స్ కు, పోలీస్ అధికారులకు మధ్య కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. ఆ సీన్స్ ఇంట్రస్టింగ్ గా తెరకెక్కేందుకు కాను.. బాలీవుడ్ యాక్షన్ డైరక్టర్ ని తీసుకుని వచ్చారని సమాచారం.  ఆ మధ్యన బాలీవుడ్ లో విడుదలైన 'యురి: ది సర్జికల్ స్ట్రైక్' చిత్రానికి  పనిచేసిన స్టీఫెన్ రిచ్చర్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. ఆయన్ని ఈ సినిమాకు తీసుకోవటంతో సినిమాపై క్రేజ్ పెరిగింది. సింగర్ గా ఉండి, కొన్ని అనూహ్య పరిణామాల మధ్య నక్సల్‌ ఉద్యమంలో చేరే ఓ యువతి పాత్రలో నటిస్తున్నారు సాయి పల్లవి.  ఇందులో పోలీసాఫీసర్‌ పాత్రలో కనిపిస్తారు రానా. ఈ చిత్రంలో నందితా దాస్, ప్రియమణి, ఈశ్వరీ రావ్‌ కీలక పాత్రధారులు.

1980 నేపథ్యంలో సాగే  ఈ సినిమా చిత్రీకరణను ఎక్కువ శాతం వరంగల్, మెదక్, కరీంనగర్‌లో ప్లాన్‌ చేశారు. సురేష్ ప్రొడ‌క్షన్స్‌, శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వర సినిమాస్ ఎల్‌.ఎల్‌.పి ప‌తాకాల‌పై సురేష్ బాబు, సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీత మందిస్తుండగా దివాక‌ర్ మ‌ణి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.