బిగిల్ చిత్రాన్ని నిర్మాత మహేష్ కోనేరు తెలుగులో విజిల్ గా రిలీజ్ చేస్తున్నారు. వరుస విజయాలతో విజయ్ కి కూడా తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. విజిల్ ప్రచార కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లో చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది. 

ఈ కార్యక్రమంలో దర్శకుడు అట్లీ మాట్లాడుతూ ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకునే వార్త ప్రకటించాడు. తన సినిమా విడుదలైన ప్రతి సారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫోన్ చేసి శుభాకాంక్షలు చెబుతుంటారని అట్లీ తెలిపాడు. ఆయనపట్ల నాకు చాలా అభిమానం ఉంది. 

నేరుగా తెలుగు చిత్రం చేయాలనేది నా కల. త్వరలోనే ఎన్టీఆర్ తో తన తెలుగు చిత్రానికి సంబందించి వార్త వెలువడుతుందని అట్లీ వేదికపై ప్రకటించాడు. తాను తమిళ వ్యక్తిని అయినప్పటికీ తన భార్య తెలుగు అమ్మాయే అని అట్లీ పేర్కొన్నాడు. తెలుగు రాష్ట్రాలు నాకు అత్తారిల్లు లాంటివి. 

నాకు మహిళలపై చాలా గౌరవం ఉంది. ఈ చిత్రంలో ఉన్న ఎమోషన్ కు ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ప్రతి మహిళ, పురుషుడు ఈ చిత్రం చూడాలని అట్లీ కోరాడు. 

చాలా రోజులుగా అట్లీ తెలుగు సినిమా చేయడం గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రభాస్ తో, ఎన్టీఆర్ తో అంటూ ఊహాగానాలు వినిపించాయి. ఎట్టకేలకు ఆ ఊహాగానాలు తెరదించుతూ తాను తెలుగులో ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నట్లు అట్లీ ప్రకటించాడు. బిగిల్ విడుదలయ్యాక అట్లీ షారుఖ్ ఖాన్ తో ఓ చిత్రం చేయబోతున్నాడు. ఆ తదుపరి చిత్రం ఎన్టీఆర్ తోనే.