హిందీతో పాటు దక్షణాది అన్ని భాషల్లో బిగ్ బాస్ షో జరుగుతోంది. బిగ్ బాస్ షోలలో గొడవలతో పాటు ప్రేమలు చిగురించిన సందర్భాలు కూడా చాలానే చూశాం. కన్నడ బిగ్ బాస్ సీజన్ 5లో మ్యూజిక్ కంపోజర్ చందన్ శెట్టి విజేతగా నిలిచాడు. అదే సీజన్ లో నివేదిత గౌడ కూడా పాల్గొంది. 

బిగ్ బాస్ హౌస్ లోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. కానీ ఎప్పుడూ వీరిద్దరూ బయటకు ఈ విషయాన్ని తెలియజేయలేదు. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వీరిద్దరి రిలేషన్ కొనసాగింది. చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కనిపించడంతో వీరి ప్రేమ హాట్ టాపిక్ గా మారింది. 

ఇదిలా ఉండగా ఇటీవల మైసూర్ లో జరిగిన దసరా ఈవెంట్ లో చందన్ శెట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ చూస్తుండగానే మోకాళ్లపై నిలబడి నివేదితకు చందన్ ప్రపోజ్ చేశాడు. 

దసరా ఈవెంట్ లో చందన్ శెట్టి అలా చేయడం విమర్శలకు దారితీసింది. వ్యక్తిగత వ్యవహారాల్ని ఇలా పబ్లిక్ ఈవెంట్ లో చూపించడం ఏంటి అంటూ అంతా చందన్ ని తిట్టి పోశారు. ఇది జరిగిన కొద్దిరోజులకే చందన్, నివేదిత నిశ్చితార్థం చేసుకుని ఆశ్చర్య పరిచారు. సోమవారం రోజు ఓ స్టార్ హోటల్ లో చందన్, నివేదిత నిశ్చితార్థం వైభవంగా జరిగింది. 

వీరిద్దరి నిశ్చితార్థానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. దసరా ఈవెంట్ లో నివేదితకు ప్రపోజ్ చేయడంపై చందన్ స్పందించాడు. మా ఇద్దరి గురించి వస్తున్న ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టాలనే అలా చేశానని తెలిపాడు. మొత్తంగా బిగ్ బాస్ షోతో కలుసుకున్న వీరిద్దరూ రియల్ లైఫ్ కపుల్స్ గా మారబోతున్నారు.