బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో పదమూడో వారం మొత్తం ఎమోషనల్ గా సాగుతోంది. మంగళవారం ఎపిసోడ్ నుండి హౌస్ లోకి కంటెస్టెంట్స్ కుటుంబసభ్యులను ఒక్కొక్కరిగా హౌస్ లోకి పంపిస్తున్నారు బిగ్ బాస్. ఇప్పటివరకు వితికా చెల్లెలు, బాబా భాస్కర్ ఫ్యామిలీ, శివజ్యోతి భర్త, అలీ భార్య మసుమ హౌస్ లోకి వెళ్లారు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో వరుణ్ సందేశ్ బామ్మ ముందుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

హౌస్ లోకి ఆమె ఎంటర్ అయిన దగ్గరనుండి హౌస్ మేట్స్ అందరూ నవ్వుతూనే ఉన్నారు. తన మాటలతో అందరినీ మెస్మరైజ్ చేసింది బామ్మ. బిగ్ బాస్ ని తమ ఇంటికి రావాలని ఆహ్వానించింది. కనీసం మీ ఫోటో అయినా పంపించండి బిగ్ బాస్ అంటూ బామ్మ అడగడం అందరికీ నవ్వు తెప్పించింది. బామ్మ హౌస్ నుండి వెళ్లిపోయిన కాసేపటికి రాహుల్ తల్లి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

కన్ఫెషన్ రూమ్ లో ఉన్న రాహుల్ తల్లి తన కొడుకుని పిలుస్తూనే ఉంది. కానీ ఆ సమయంలో రాహుల్ పవర్ సేవ్ మోడ్ లో ఉండడంతో కదల్లేని పరిస్థితి. బిగ్ బాస్ అతడిని రిలీజ్ చేయడంతో వెంటనే అతడు కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్లి తన తల్లిని హత్తుకున్నాడు. గేమ్ బాగా ఆడాలని రాహుల్ కి అతడి తల్లి సూచించింది. హౌస్ మేట్స్ అందరూ బాగా ఆడుతున్నారని.. రాహుల్ ఏదైనా ఉంటే మొహం మీద అనేస్తాడే తప్ప అతడు మనసు చాలా మంచిదని అతడి తల్లి అందరికీ చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ హోటల్ ఆమెకి నచ్చడంతో ఓ స్టార్ ఇచ్చింది.

ఆమె వెళ్లిన కాసేపటికి శ్రీముఖి తల్లి లత హౌస్ లోకి వచ్చింది. ఆమెని చూసిన శ్రీముఖి పరుగున వెళ్లి హత్తుకోబోయింది ఇంతలో బిగ్ బాస్ శ్రీముఖిని కదలనివ్వకుండా పవర్ సేవ్ మోడ్ లో పెట్టేశారు. దీంతో శ్రీముఖి తల్లి కూతురిని కౌగించుకొని ఏడ్చేసింది. బిగ్ బాస్ శ్రీముఖిని రిలీజ్ చేయకుండా.. ఆమె తల్లిని వచ్చిన దారినే బయటకి వెళ్లాలని ఆదేశించారు. దీంతో శ్రీముఖి 'అమ్మా.. వెళ్లొద్దు' అంటూ వెక్కి వెక్కి ఏడ్చేసింది. కొంచెం సమయం తరువాత మరో డోర్ ద్వారా శ్రీముఖి తల్లి హౌస్ లోకి రాగా.. తన తల్లిని పట్టుకొని ఎమోషనల్ అయిపోయింది శ్రీముఖి.

బయట పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకుంది. అనంతరం.. శ్రీముఖి తల్లి లత హౌస్ మేట్స్ అందరితో మాట్లాడాలని చెప్పి రాహుల్ కి స్వీట్ వార్నింగ్ ఇచ్చేసింది. రాహుల్, శ్రీముఖి బయట స్నేహితులు కావడం, కానీ హౌస్ లోకి వచ్చి గొడవ పడుతుండడంతో తను చూడలేకపోతున్నానని.. మీరు ఇలా ఇంట్లో ఒకరితో ఒకరు గొడవ పడుతుంటే బయట మీ పేరెంట్స్ ఎంత బాధ పడతారో ఆలోచించండి అంటూ రాహుల్ కి క్లాస్ తీసుకుంది.