శనివారం నాటి ఎపిసోడ్ లో ఎప్పటిలానే నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు. మన టీవీ ద్వారా హౌస్ లో కంటెస్టెంట్స్ ఏం చేస్తున్నారో చూపించారు. హౌస్ మేట్స్ ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయంపై ఒకరితో మరొకరు డిస్కస్ చేసుకున్నారు. ఇక నామినేషన్స్ లో ఉన్న ఏడుగురు సూట్ కేసులు సర్దేయగా.. బాబా భాస్కర్ మాత్రం తన మీద నమ్మకంతో ఖాళీ సూట్ కేస్ పంపించారు.

అనంతరం నాగార్జున హౌస్ మేట్స్ తో మాట్లాడారు. వారితో ఓ టాస్క్ ఆడించారు. మొత్తం ఏడు స్థానాల్లో ఎవరెవరు ఏ పొజిషన్ కి అర్హులో చెప్పాలని నాగార్జున చెప్పగా.. అలీ రెండో స్థానం, రాహుల్ నాలుగో స్థానం, బాబా మూడో స్థానం, వరుణ్ ఏడవ స్థానం, వితికా మూడవ స్థానంలోచూసుకుంటున్నామని వివరణ ఇచ్చారు. ఇక శ్రీముఖి తనను మొదటి స్థానంలో చూస్తున్నట్లు చెప్పింది. ఈ క్రమంలో రాహుల్ తో చిన్నపాటి వాగ్వాదం జరిగింది.

 

తనని బిగ్ బాస్ హౌస్ కి శ్రీముఖి రికమండ్ చేసినట్లు హౌస్ లోవరుణ్, వితికాలతో శ్రీముఖి ఓ సంధర్భంలో చెప్పిందని రాహుల్ నేరుగా నాగార్జునతో చెప్పాడు. శ్రీముఖి ఈ విషయాన్ని అంగీకరించలేదు. వరుణ్, వితికా కూడా తమకు గుర్తు లేదని చెప్పారు. దీంతో మిస్ కమ్యూనికేషన్ జరిగిందని నాగార్జున నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. బిగ్ బాస్ ఆట కోసం ఎవరూ ఎవరినీ రికమండ్ చేయరని.. దానికో ప్రాసెస్ ఉంటుందని నాగార్జున క్లారిటీ ఇచ్చారు.

అనంతరం హౌస్ మేట్స్ కి చెందిన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఒక్కొక్కరినీ స్టేజ్ మీదకి పిలిచి వారితో గేమ్ ఆడించాడు నాగార్జున. అలా గెస్ట్ లుగా వచ్చిన వారు హౌస్ లో ఉన్న తమ వారికి కోసం గిఫ్ట్స్ తీసుకొచ్చారు. ఈ ప్రాసెస్ లో ఎవరు ఈ వారం సేవ్ అవ్వబోతున్నారో గిఫ్ట్స్ ద్వారా ఓ కార్డ్ పంపించి చెప్పించారు. ఈ వారం ఎలిమినేషన్ నుండి శ్రీముఖి, రాహుల్, బాబా భాస్కర్ సేవ్ అయినట్లు అనౌన్స్ చేశారు. మిగిలిన నలుగురిలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో ఆదివారం ఎపిసోడ్ లో తేలనుంది!