బిగ్ బాస్ సీజన్ 3 ఆదివారం ఎపిసోడ్ తో పదకొండు వారాలు పూర్తి చేసుకుంది. ఈరోజు ఎలిమినేషన్ ఉండడంతో షోపై ఆసక్తి పెరిగింది. అయితే నాగార్జున షోని కాస్త ఫన్ గా నడిపించే ప్రయత్నం చేశారు. నవరాత్రి సందర్భంగా కంటెస్టెంట్స్ నవరసాలు పలికించాలని బిగ్ బాస్ హౌస్‌లో సంబరాలు నిర్వహించారు.

ఒక్కో కంటెస్టెంట్ కి ఒక్కో రసాన్ని ఇచ్చి వారిని పెర్ఫార్మ్ చేయమని చెప్పారు నాగార్జున. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ ఒక్కో రసాన్ని ఒలకబోస్తూ తమ పెర్ఫామెన్స్‌తో మెప్పించారు. అనంతరం ఎలిమినేషన్ ప్రాసెస్ లోకి వచ్చారు నాగార్జున. ఈ వారం రాహుల్‌, వరుణ్‌, పునర్నవి, మహేష్‌లు నామినేట్‌ కాగా.. తొలుత డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటుందని భావించారు.

కానీ నాగార్జున ఎక్కువ ఆలస్యం చేయకుండా పునర్నవి పేరు అనౌన్స్ చేశారు. దీంతో పునర్నవి హౌస్ నుండి బయటకి వచ్చేసింది. స్టేజ్ పైకి వచ్చి నాగార్జునతో ముచ్చటించిన పునర్నవి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో మన టీవీ ద్వారా మాట్లాడింది.

రాహుల్ ని పునర్నవి కోసం ఓ పాట పాడాలని నాగార్జున అడగగా.. రాహుల్ 'ఏమైపోయావో..' అంటూ పాట మొదలుపెట్టి  ఎమోషనల్ అయిపోయాడు రాహుల్. పునర్నవి కోసం వెక్కి వెక్కి ఏడ్వడంతో హౌస్ మేట్స్ అతడిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు.