బిగ్ బాస్ సీజన్ 3 గురువారం నాటి ఎపిసోడ్ తో 82 ఎపిసోడ్ లను పూర్తి చేసుకుంది. ఈ ఎపిసోడ్ లో బిగ్ బాస్.. హౌస్ మేట్స్ కి ఆసక్తికరమైన టాస్క్ ఇచ్చారు. 'టాస్క్ హంట్ అండ్ హిట్' అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో ఒక బూత్ ఏర్పాటు చేసి.. అందులో ప్రతి ఇంటి సభ్యుడికి సంబంధించిన ఓ ముఖ్యమైన వీడియోను ప్లే చేసి చూపించారు.

ఆ వీడియోలో తమ గురించి మాట్లాడిన వ్యక్తిని గార్డెన్ ఏరియాలోకి పిలిచి ఆ విషయం గురించి చర్చించి ఆ తరువాత ఆ వ్య్కతి ఫోటోని కుండకు అంటించి దాన్ని దిష్టిబొమ్మకు పెట్టి పగలగొట్టాలి. ముందుగా బాబా భాస్కర్ కి వీడియో ప్లే చేసి చూపించారు. అందులో వితికా, రాహుల్, వరుణ్ లు అలానే మహేశ్, అలీ మాట్లాడుకుంటున్న వీడియోలు ప్లే చేసి చూపించారు.

అలీ మాటలకు బాధ పడ్డ బాబా భాస్కర్.. అతడిని పిలిచి చర్చించి.. అలీ దిష్టిబొమ్మని పెట్టి పగలగొట్టాడు. ఇక శ్రీముఖికి చూపించిన వీడియోలో అలీ, శివజ్యోతి, మహేష్ లు తన గురించి నెగెటివ్ గా మాట్లాడారు. ఈ విషయంపై అలీ, శివజ్యోతిలతో చర్చించిన శ్రీముఖి.. మహేష్ తో మాత్రం మాట్లాడడానికి ఇష్టపడలేదు. అతడికి ఆల్ ది బెస్ట్ చెప్పి దిష్టిబొమ్మకు మహేష్ ఫోటో అతికించి కుండను పగలగొట్టింది.

ఈ టాస్క్ లో ఎక్కువగా అలీ, మహేష్ లు టార్గెట్ అయ్యారు. అనంతరం బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరినీ సంతోషంగా ఉండాలని, తనను సంతోషంగా ఉండేలా చేయాలని చెప్పి వారి కోసం డీజే మ్యూజిక్ పెట్టి డాన్స్ చేయించారు. వారి కోసం రకరకాల కేకులు తెప్పించారు. బిగ్ బాస్ పంపించిన కేకులు తినలేక హౌస్ మేట్స్ తెగ ఇబ్బంది పడ్డారు.