ఈ వారం బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి ఇచ్చిన హోటల్ టాస్క్ ఎంతో ఎమోషనల్ గా సాగింది. కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇక శుక్రవారం నాటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ముందుగా హౌస్ మేట్స్ ని తమ లైఫ్ గ్రాఫ్ ని గీయాలని చెప్పారు. దీంతో ఒక్కో కంటెస్టెంట్ తాము ఎలా ఈ స్థాయికి వచ్చారో వివరించారు.

 

కాసేపటి తరువాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి మరో టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా వరుణ్, వితికా.. బాహుబలి, దేవసేనలుగా నటించాలి. శ్రీముఖి.. మహానటిగా, బాబా భాస్కర్.. మాణిక్ భాషాగా, శివజ్యోతి.. చంద్రముఖిగా, రాహుల్.. కాంచనగా, అలీ.. గజినీగా నటించాల్సి ఉంటుంది. ఈ టాస్క్ వినోదాత్మకంగా ఉండాలని బిగ్ బాస్ ఇచ్చారు. దీంతో కంటెస్టెంట్స్ ఎవరి గెటప్స్ వారు ధరించి తమ టాలెంట్ చూపించారు.

బాహుబలి, దేవసేన పాత్రలు ధరించిన వరుణ్, వితికా.. 'బాహుబలి' సినిమాలో ప్రభాస్ భుజాల మీద నుండి అనుష్క వెళ్లే సీన్ స్పూఫ్ చేయాలనుకున్నారు. ఈ క్రమంలో శ్రీముఖి దగ్గరుండి మరీ ఈ సీన్ చేయించింది. అయితే వరుణ్ భుజంపై వితికా కాలు పెట్టగానే వరుణ్ బ్యాలన్స్ తప్పడంతో ఇద్దరూ కిందపడ్డారు. ఆ దెబ్బకి వరుణ్ నడుం విరిగింది. ఇకపై ఇలాంటివి చేయనని దండం పెట్టేశాడు. 'పోనీ నేను భుజం మీద నడవనా..?' అంటూ శ్రీముఖి అడగడం నవ్వులు పూయించింది.

ఇక మహానటిగా శ్రీముఖి తన పాత్రలో జీవించేసింది. బాబా, శివజ్యోతి, అలీ తమకు తోచినట్లుగా చేశారు. అందరికంటే ఈరోజు షోలో హైలైట్ గా నిలిచింది మాత్రం రాహుల్ అనే చెప్పాలి. కాంచన గెటప్ లో చీర కట్టుకొని అతడు చేసిన పెర్ఫార్మన్స్ కి తెగ నవ్వుతున్నారు. ఫైనల్ గా 'కాంచన' సినిమాలో పాటకు తన మాస్ స్టెప్పులు జోడించి హౌస్ ని షేక్ చేశాడు.