సాంఘిక చిత్రాల్లోనే కాకుండా, జానపద, పౌరాణిక, చారిత్రక సినిమాల్లో అనేక పాత్రలకు తనదైన నటనతో జీవం పోసి వెండితెర లైలా గా వెలిగారు భానుమతి. నటిగానే కాకుండా రచయితగా, దర్శకురాలిగా, సంగీత దర్శకురాలిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా తెలుగుతెరపై చెరగని ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి. దాదాపు 200కు పైగా చిత్రాలలో నటించి, మూడుతరాల నటులతో పనిచేసిన భానుమతిగారు కు కూడా తీరని ముచ్చట్లు ఉంటాయా...అంటే  మనకు తెలిసి ఒకటుందనే చెప్పాలి. అదేంటో చూద్దాం.

యాభైల్లో  హీరోయిన్ గా వెలుగుతున్న భానుమతి తన భరణి బ్యానర్ పై శ్రీకృష్ణ తులాభారం సినిమా తీద్దామని అనుకున్నారు. నారదుడు వేషం వెయ్యాలని ఆవిడ ముచ్చట.  అందుకు కారణం ఉంది. భానుమతి సినిమాల్లోకి రావటానికి ఇన్సిప్రేషన్ కాంచనమాల అయితే, నారదుడు వేషంలో టంగుటూరి సూర్య కుమారిలా మెప్పించాలనేది ఆమె చిరకాల వాంఛ. రావూరి వారిని స్క్రిప్టు రాయమని కోరింది. ఈ లోగా ముందసలు తాను నారదుడు గెటప్ లో ఎలా ఉంటానో చూసుకునేందుకు గానూ మేకప్ టెస్ట్ చేయించుకుంది. ఇక్కడ చూస్తున్నది ఆ ఫొటోనే. కానీ ఆమె భర్త రామకృష్ణ గారు ఆసక్తి చూపని కారణంగా ఆ సినిమా పట్టాలు ఎక్కలేదు. అయితే ఆ జ్ఞాపకం మాత్రం చాలా కాలం ఆమె గుర్తు చేసుకుంటూనే ఉండేవారు.  భానుమతి అపురూపంగా తీయించుకున్న ఈ  ఫొటోని ఆవిడ చాలా కాలం తన దగ్గరే పెట్టుకున్నారు.

నటిగా భానుమతి తొలి చిత్రం  ‘వరవిక్రయం’. భానుమతిని మొదట ఆమె తండ్రి గాయనిగానే చూడాలనుకున్నాడు. తొలుత అభ్యంతరం చెప్పినా, టంగుటూరి సూర్యకుమారి ప్రోద్బలంతో నటిగా సినీ జీవితాన్ని ప్రారంభించింది. ఆ రోజుల్లో ప్లేబ్లాక్ పద్ధతి ఉండేది కాదు. ఎవరి పాటలను వారే పాడుకునే వారు. తొలి సినిమాతోనే తన నటన, గాత్రంతో అందిరిని ఆకట్టుకుంది భానుమతి.  ఆమెతో నటించాలని ఎన్టీఆర్, ఏఎన్నాఆర్‌లే కలుల కనే స్దాయికి ఎదిగారామె.