స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా విభిన్న చిత్రాల దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం పుష్ప. అల వైకుంఠపురములో లాంటి క్లాస్ హిట్ తరువాత బన్నీ నటిస్తున్న సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా బన్నీ డిఫరెంట్‌ గెటప్‌లో కనిపించనున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన బన్నీ ఫస్ట్ లుక్‌కు సూపర్బ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమాలో బన్నీ గందపు చెక్కల స్మగ్లర్‌గా నటిస్తున్నాడన్న టాక్‌ వినిపిస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో బన్నీకి జోడిగా రష్మిక మందన్న నటిస్తోంది. అంతేకాదు బన్నీ నటిస్తోన్న తొలి పాన్ ఇండియా సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఐదు భాషల్లో సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అయితే సినిమా ప్రారంభమైన సమయంలొనే ఈ సినిమాలో కీలక పాత్రల్లో తమిళ నటుడు విజయ్‌ సేతుపతి నటిస్తున్నాడని ప్రకటించారు చిత్రయూనిట్.

కానీ తాజా లాక్‌ డౌన్‌ కారణంగా షూటింగ్ చాలా ఆలస్యం కావటంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే తాజాగా ఆ పాత్రకు ఓ కన్నడ నటుడ్ని తీసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. భైరవ గీత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన ధనుంజయ్‌ను ఆ పాత్రకోసం తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

రామ్‌ గోపాల్ వర్మ నిర్మాణంతో సిద్ధార్థ్‌ తాతోలు దర్శకత్వంలో తెరకెక్కిన భైరవ గీత సినిమా మంచి పేరే వచ్చింది. తెలుగులో పెద్దగా ఆకట్టుకోకపోయినా కన్నడ మంచి విజయం సాధించింది ఈ సినిమా. ఇప్పుడు మరోసారి ఓ క్రేజీ ప్రాజెక్ట్‌తో ధనుంజయ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో అతనికి ఈ సినిమా మంచి బ్రేక్ అవుతుందని భావిస్తున్నారు.