అగ్ర నిర్మత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ గణేశ్ ను హీరోగా పరిచయం చేస్తూ బీటెల్ లీఫ్ ప్రొడక్షన్ & లక్కీ మీడియా బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ నిర్మాతలు బెల్లంకొండ సురేష్, దిల్ రాజు, సురేష్ బాబు, జెమినీ కిరణ్, అభిషేక్ నమ, అభిషేక్ అగర్వాల్, MLA జీవన్ రెడ్డి, చంటి అడ్డాల, రాజ్ కందుకూరి, మిరియాల రవీందర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కెమెరా స్విచ్ ఆన్ చెయ్యగా నిర్మాత దిల్ రాజు తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టారు. డైరెక్టర్ వివి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ వివి.వినాయక్ మాట్లాడుతూ... ''నన్ను బెల్లంకొండ సురేష్ గారు దర్శకుడిగా పరిచయం చేశారు. వాళ్ళ అబ్బాయి శ్రీనివాస్ ను నేను హీరోగా పరిచయం చేశాను. ఇప్పుడు సురేష్ గారి చిన్నబ్బాయి గణేష్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనడం సంతోషంగా ఉంది. పవన్ సాధినేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో గణేష్ హీరోగా మంచి పేరు తెచ్చుకుంటాడాని భావిస్తున్నాను'' అన్నారు.

నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ...''ఈ సినిమాకి ముందుగా అంద‌రూ చాలా మంచి టెక్నీషియ‌న్స్ కుదిరారు. నేనే మా అబ్బాయిని లాంచ్ చేద్దామ‌నుకున్నా కానీ బెక్కం మంచి క‌థ‌తో వ‌చ్చాడు'' అన్నారు.

హీరో బెల్లంకొండ గణేష్ మాట్లాడుతూ.. ''నేను ఇప్పుడు ఈ స్థానంలో ఉండడానికి కారణం మా నాన్న బెల్లంకొండ సురేష్ గారు. నన్ను ఎపుడూ సపోర్ట్ చేస్తున్న మా పేరెంట్స్ కు రుణపడి ఉంటాను. అన్నయ్య సాయి శ్రీనివాస్ నన్ను ఒక బ్రదర్ కంటే ఎక్కువగా చూసుకున్నాడు. ఒకరోజు నాన్న నాకు ఈ కథ వినమని చెప్పడంతో విన్నాను. కథ విన్నప్పుడు ఎమోషనల్ అయ్యాను. మంచి కథతో నా దగ్గరికి వచ్చిన బెక్కం వేణు గోపాల్, పవన్ సాధినేని గార్లకు ధన్యవాదాలు'' అని చెప్పారు.