ఒక రోజు ఉదయం ఒకాయన ఒక అమ్మాయితో మా ఇంటికి వచ్చారు. ఈ అమ్మాయి నా కూతురు. సినిమాల్లో నటించాలని ఉవ్విళ్లూరుతోంది. మీరు ఈ స్టిల్స్ తీస్తే నిర్మాతలకు చూపించటానికి సౌకర్యంగా ఉంటుంది అని అన్నారు. ఆయన పేరు చౌదరి గారు.  ఆయన కోరినట్లే, ఆ అమ్మాయిని వివిధ భంగిమల్లో ఫొటోలు తీసాను. ఆ అమ్మాయికి ఆ తర్వాత ఓ సినిమాలో నటించే అవకాశం లభించింది. ఆ చిత్రం సంసారం (1950).ఆ చిత్ర నిర్మాత రంఘనాధ్ దాస్. ఎల్ వి ప్రసాద్ డైరక్ట్ చేసారా చిత్రం. నాగేశ్వరరావు కథానాయకుడుగా నటించారు. అయితే ఆ అమ్మాయికి ఆ అవకాశం వచ్చినట్లే వచ్చి  చేజారిపోయింది. ఆమె ముఖ వర్చస్సు బాగోలేదని ఆ అమ్మాయిని ఆ చిత్రంలోంచి తీసేసారు. కానీ ఆ అమ్మాయి ఆ తర్వాత తెలుగు,తమిళ చిత్రాలలో తిరుగులేని నాయక అయ్యింది. నటనలో ఎందరికో మార్గదర్శకురాలైంది.  ఆ అమ్మాయి సావిత్రి.

దేవదాసులో నాగేశ్వరరావు సరసన నటించిన తర్వాత ఆమె నటించిన అన్ని చిత్రాలు ఆమె నటనా ప్రతిభకు దర్రణం పట్టాయి.సావిత్రి ఎలాంటి తారతమ్యాలు లేకుండా అందిరితో కలుపుగోలుగా, సమభావంతో ఉండేది. తన సహనటులు విషయంలోనే కాక, టెక్నీషియన్స్ కు కూడా ఎంతో మర్యాద ఇచ్చేది. అంతా తనకు మాత్రమే తెలుసు అన్నట్లుగా ఎన్నడూ ప్రవర్తించది కాదు. ఆమె పోషించిన పాత్రల్లో సీరియస్ పాత్రలే ఎక్కువగా ఉన్నా సహజంగా ఆమె సరదాగా ఉండే వ్యక్తి. ఆమె నటించిన పలు చిత్రాలకు నేను స్టిల్ ఫొటో గ్రాఫర్ గా ఉన్నాను. సెట్ లో మెళ్లో కెమెరా వేసుకుని ఎలా స్టిల్స్ తీసేవాణ్ణో, ఆమె నా వద్ద నుంచి కెమెరా తీసుకుని మెళ్లో వేసుకుని నన్ను అనుకరిస్తూ, తమాషాగా నటించి చేసవేరా.

సర్కస్ రాముడు (1980) చిత్రం సెట్లో పెట్టడానికి సావిత్రి ఫొటో కావాలని అడిగారు. అందుకని ఆ స్టిల్ తీయించుకునేందుకు సావిత్రి వచ్చారు. అప్పుడు సావిత్రిని చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. చాలా సంవత్సరాల క్రితం ఆమె తొలిసారిగా మా ఇంటికి సినిమాల్లో నటించటానికి స్టిల్స్ తీయించుకోవటానికి ఎలా ఉందో, అలాగే సన్నగదా ఉంది. కానీ అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా అనిపించింది. ఆ స్టిల్ తీసేముందు ఆమె స్దితి చూసి, నాకు చాలా బాధ కలిగింది. అదే నేను ఆమెను చివరి సారిగా తీసిన స్టిల్.

సావిత్రికి మొదటి బిడ్డ-కుమార్తె పుట్టినప్పుడు ఆమె నాకు కబురు పెట్టారు. ఆమె కుమార్తెను చూడటానికి నేను నా భార్యతో సహా వెళ్లాను. ఆ శిశువును చూడడానికి ఉత్తి చేతులతో వెళితే ఏం బాగుంటుందని నేను ఒక నవరన్ బంగారం కొని తీసుకు వెళ్లి ఆ శిశువు చేతిలో పెట్టాను అది చూసి సావిత్రి ఎంతో సంతోషంతో తన బంధువులందిరతోనూ, భర్తతోనూ చూడండి...నా బంగారు పాప చేతికి బంగారం ఇచ్చారు అని చెప్పారు. అప్పుడు ఆమె ముఖంలో కనిపించిన సంతోష ఛాయిలు ఇప్పటికీ నా మదిలో మెదులుతూనే ఉన్నాయి. 

(ఇదంతా కూడా ప్రముఖ స్టిల్ ఫొటో గ్రాఫర్ ఆర్..ఎన్.నాగ రాజారావుగారు స్వయంగా రాసినది. సావిత్రికే కాక చాలా మంది నటీ,నటులకు తొలి మేకప్ స్టిల్ తీసింది ఈయనే)