సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ ఆర్మీ మేజర్ గా నటించిన ఈ చిత్రంపై ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. లేడి అమితాబ్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఇది. సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకని నేడు ఎల్బీస్టేడియంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. తొలిసారి మెగాస్టార్ చిరంజీవి మహేష్ బాబు చిత్రం కోసం చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నారు.   

కొద్ది సేపటి క్రితమే ప్రారంభమైన ప్రీరిలీజ్ వేడుకలో నటుడు, బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ ప్రసంగించారు. ఎప్పటిలాగే హుషారుగా, సరదాగా మాట్లాడి అలరించారు. సూపర్ స్టార్ మహేష్ నటించిన చిత్రం కోసం  మెగాస్టార్ చిరంజీవి అతిథిగా రానుండడం ఎంతో సంతోషించదగ్గ విషయం అని గణేష్ తెలిపాడు. 

తాను ఒక రోజు కోళ్ల ఫామ్ లో ఉండగా నిర్మాత శిరీష్ నాకు ఫోన్ చేశారు. చెప్పు అన్నా.. నీ కోసం కోడి గుడ్లు తీసుకురావాలా అని అడిగా. నేను చెప్పింది చేయాలి.. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు మూవీలో నటించాలి అని అడిగారు. అందుకు అంగీకరించా. దర్శకుడు అనిల్ రావిపూడి నాకు గమ్మత్తైన పాత్ర ఇచ్చారు. 30 ఏళ్ల ముందు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టా. మేనేజర్ స్థాయి నుంచి నిర్మాత వరకు ఎదిగా. 

ఒక స్టార్ చొరవతో(పరోక్షంగా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి) స్టార్ ప్రొడ్యూసర్ అయ్యా. ఏఈ టైం గ్యాప్ లో రాజకీయాల్లోకి వెళ్లి తప్పు చేశా. 7 గంటలు, బ్లేడు గణేష్ ఇలా పిలిపించుకుని ఎర్రి డాష్ అనిపించుకున్నా అంటూ గణేష్ సరదాగా వ్యాఖ్యానించారు. ఇకపై రాజకీయాల్లోకి వెళ్లదలుచుకోలేదు. ఇకపై సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగుతా. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడమే నా పని అని బండ్ల గణేష్ తెలిపారు. సరిలేరు నీ కెవ్వరు చిత్రం ఇండస్ట్రీ హిట్ ఖాయం అని బండ్ల గణేష్ విశ్వాసం వ్యక్తం చేశారు.