తనను కొడుకూ అని పిలిచే సత్యం మాస్టారుతో ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం గొడవ పడ్డారు. సత్యం మాస్టారు కాలర్ పట్టుకుని దులిపేశారు.  చలం సినిమాలో ఓ బంగరు రంగుల చిలుక అనే పాటను రికార్డు చేశారు. దానికి సత్యం మాస్టారు సంగీత దర్శకుడు. ఆ పాట చాలా బాగా వచ్చిందని చలం పార్టీ ఏర్పాటు చేశారు. 

ఆ పార్టీలో ఆ సంఘటన చోటు చేసుకుంది. స్క్రీన్ అనే పత్రికలో బాలసుబ్రహ్మణ్యం ఇంటర్వూ వచ్చింది. అందులో శ్యాం తనను బాలీవుడ్ కు పరిచయం చేయాలని అనుకున్నారు గానీ తనకు కుదరలేదని బాలసుబ్రహ్మణ్యం ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే, ఆ ఇంటర్వ్యూలో తన పేరు ప్రస్తావించలేదని సత్యం మాస్టారు మనసులో పెట్టుకున్నారట. దాంతో పార్టీలో సత్యం మాస్టారు ఆ విషయాన్ని ప్రస్తావించి బాలును అనరాని మాట ఒకటి అన్నారట. అంతే, బాలుకు కోపం కట్టలు తెంచుకుంది. 

సలీల్ చౌదరి తనకు దక్షిణాది నుంచి ఓ గాయకుడు కావాలని అడిగితే శ్యాం బాలు పేరు చెప్పారట. తన షెడ్యూల్ వల్ల బాలుకు కుదరలేదట. ఆ విషయం బాలు స్క్రీన్ ఇంటర్వ్యూలో చెప్పారు. అనరాని మాట అనడంతో బాలు తండ్రిలాంటి సత్యం మాస్టారు కాలర్ పట్టుకుని దులిపేశాడట.

ఆ మర్నాడు ఉదయం సత్యం మాస్టారు చేసే సినిమాకు బాలు పాట పాడాల్సి ఉంది. అయితే, తాను రేపు పాట పాడడానికి వెళ్లడం లేదని బాలు విఠల్ కు చెప్పారు. సత్యం మాస్టారు ఫోన్ చేస్తే విఠల్ ఫోన్ ఎత్తి బాలు పాడడానికి రావడం లేదని చెప్పారట. అలా ఫోన్ చేస్తూనే ఉంటే చివరకు బాలు ఎత్తాడు. కొడుకూ... ఏమిటి నాకు పాడనన్నావట.. నువ్వు పాడకపోతే పాట ఏమై పోవాలి అని సత్యం మాస్టారు అన్నారట. 

వెంటనే వస్తున్నానని చెప్పి ఎస్బీ బాలు వెళ్లి పాట పాడారు. పాట ాడడం పూర్తయిన తర్వాత సత్యం మాస్టారు వచ్చి ఎస్బీ బాలును గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. మాటలు మాత్రం లేవు ఇరువురి కళ్లలోనూ నీళ్లు..  ఆ పాట ప్రణయ రాగవాహినీ.. సఖీ...