బాలయ్య,రవితేజ కాంబినేషన్ సినిమా అంటే ఓ రేంజిలో క్రేజ్ వస్తుంది. ఖచ్చితంగా ఓపినింగ్స్ అదిరిపోతాయి. అందులోనూ మళయాళ రీమేక్ అంటే డిస్ట్రిబ్యూటర్స్ క్యూ కడతారు. ఇదీ నిర్మాతల స్ట్రాటజీ. ఇందుకు రవితేజ ఓకే అన్నాడు. కానీ బాల్ బాలయ్య కోర్ట్ లో ఉంది. ఆయన సినిమా చూసి నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఈ డ్రీమ్ ప్రాజెక్టు పట్టాలు ఎక్కుతుంది.  ఇంతకీ ఆ సినిమా ఏమిటి అంటారా..

కొన్ని పాత్రలకు కొందరే సెట్ అవుతారు. వారి కోసం కొన్ని ప్రాజెక్టులు అలా వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు అదే పరిస్దితి 'అయ్యప్పనుం కోశియుం' తెలుగు రీమేక్ కు ఏర్పడింది.  ఈ ఏడాది ఫిబ్రవరిలో  మలయాళంలో విడుదలై సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోసియుమ్' సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేయబోతున్నారు. మలయాళంలో సాచి దర్శకత్వంలో వచ్చిన 'అయ్యప్పనుం కోశియుం' సినిమా అక్కడ భారీ విజయాన్ని సాధించింది.  దాదాపు 7 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం 50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఇతర ఇండస్ట్రీ నిర్మాతల దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్ర తెలుగు రీమేక్ హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ భారీ రేటుకు కొనుక్కుంది. 

ఈ సినిమా ఒక రిటైర్ట్ హవల్దార్, ఓ పోలీస్ ఆఫీసర్ మధ్య నడిచే కథాంశంతో తెరకెక్కింది. మలయాళంలో ఈ చిత్రంలో బిజు మీనన్, పృథ్వీరాజ్ నటించారు. వీళ్లిద్దరు మధ్య నడిచే ఈగో వార్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాని తెలుగులో చెయ్యటానికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే బాలయ్య ఈ సినిమాని చూసి, ఓకే చేస్తే పట్టాలు ఎక్కిస్తారట. బాలయ్యను ఈ సినిమాలో బిజు మీనన్ చేసిన పాత్రకు అడుగుతున్నారు. ఇంకా బాలయ్య ఈ సినిమా చూడలేదట. 

సినిమా చూస్తే ఖచ్చితంగా బాలయ్య ఓకే చేస్తారని నిర్మాత నాగ వంశీ నమ్ముతున్నారు. అయితే ఆ పాత్రకు హీరోయిన్, డ్యూయిట్స్ వంటివి ఉండవు. బాలయ్య ఫెరఫెక్ట్ గా సూట్ అవుతారు. కానీ ఆయన ఒప్పుకోవాలి. బాలయ్య కనుక నో చెప్తే... ఆ పాత్రను రవితేజ చేత చేయించి, పృధ్వీరాజ్ చేసిన పాత్రను రానా చేత చేయించాలని ఆలోచనగా చెప్తున్నారు. రవితేజ ఈ సినిమా తనకు బ్రేక్ ఇస్తుందని భావిస్తున్నారట.
   
ఇదిలా ఉంటే ఈ సినిమాను, తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో లారెన్స్ హీరోగా నటిస్తుండగా, ఆయనకు జోడీగా ప్రియా భవానీని ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాకి లారెన్స్ దర్శకత్వం వహిస్తాడా? లేదా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది.