అమరావతి: తెలుగు సినీ పరిశ్రమ సమస్యలపై చర్చలు జరపడానికి మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని సినీ ప్రముఖులు ఈ నెల 9వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలవనున్నారు. జగన్ తో సమావేశానికి రావాల్సిందిగా నందమూరి హీరో, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎమ్మెల్యే బాలకృష్ణను కూడా ఆహ్వానించారు. 

తాను సమావేశానికి రాలేనని బాలకృష్ణ వారికి చెప్పినట్లు తెలుస్తోంది. తన జన్మదినం వల్ల తాను రాలేనని ఆయన చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తో భేటీకి తనను పిలువకపోవడంపై బాలకృష్ణ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో జగన్ తో భేటీకి సినీ పెద్దలు బాలకృష్ణను కూడా ఆహ్వానించారు. అయితే జగన్ తో సమావేశానికి బాలకృష్ణ దూరంగా ఉంటున్నారు. ఈ నెల 9వ తేదీన బాలకృష్ణ జగన్ తో భేటీ కానున్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అది ప్రచారంలోకి వచ్చినట్లు అర్థమవుతోంది. 

కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి అమలవుతున్న లాక్ డౌన్ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ తీవ్రమైన చిక్కుల్లో పడింది. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమకు వెసులుబాట్లు కల్పించాలని చిరంజీవి నేతృత్వంలోని సినీ పెద్దలు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తోనూ ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తోనూ సమావేశమై చర్చలు జరిపారు. 

కేసీఆర్ తో చర్చలకు తనను ఆహ్వానించకపోవడంపై బాలయ్య అగ్గి మీద గుగ్గిలమయ్యారు. తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు. భూముల పంపకాల కోసమే వారు ఇదంతా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జగన్ తో భేటీ విషయంలో బాలయ్య నుంచి వివాదం లేకుండా చూసుకోవడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి జగన్ ను కలుసుతన్నట్లు నిర్మాత సి కల్యాణ్ చెప్పారు. బర్త్ డే కారణంగా బాలకృష్ణ రాలేకపోతున్నారని ఆయన చెప్పారు. 9వ తేదీన జగన్ ను కలుస్తున్న విషయాన్ని ఆయన ధ్రువీకరించారు. తానే ఫోన్ చేసి బాలకృష్ణను ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. బర్త్ డే సందర్భంగా పూజలు ఉన్నాయని, అందువల్ల రాలేనని బాలకృష్ణ చెప్పారని ఆయన అన్నారు. ఇండస్ట్లీలో ఏ విదమైన గ్రూపులు లేవని కల్యాణ్ స్పష్టం చేశారు. ఇండస్ట్రీ కోసం బాలకృష్ణ ముందుంటారని ఆయన అన్నారు..