నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం రూలర్. బాలకృష్ణ మాస్ చిత్రాలు చేస్తే అభిమానుల్లో ఉండే క్రేజే వేరు. బాలకృష్ణ నుంచి ఫ్యాన్స్ పవర్ ఫుల్ మాస్ యాక్షన్ చిత్రాలు కోరుకుంటారు. బాలకృష్ణ ప్రస్తుతం అలాంటి కమర్షియల్ ప్యాకేజ్ లాంటి చిత్రాన్ని అభిమానులకు అందించే పనిలో ఉన్నారు. 

సీనియర్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం బాలకృష్ణ రూలర్ మూవీలో నటిస్తున్నాడు. గత ఏడాది సంక్రాంతికి విడుదలైన జైసింహా చిత్రం తర్వాత కెఎస్ రవికుమార్ మరోమారు బాలయ్యని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో అందాల భామలు వేదిక, సోనాల్ చౌహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

డిసెంబర్ 20న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న రూలర్ మూవీ ప్రచార కార్యక్రమాలు ప్రారంభమైపోయాయి. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఊహించినట్లుగానే కేఎస్ రవికుమార్ బాలకృష్ణని పవర్ ఫుల్ గా ప్రెజెంట్ చేశారు. బాలయ్య పోలీస్ ఆఫీసర్ గా, బిజినెస్ మెన్ గా రెండు విభిన్నమైన లుక్ లో కనిపిస్తున్నాడు. 

ట్రైలర్ ఆరంభంలో 'ఎవరికీరా ఫోన్ చేస్తున్నావ్.. ఫైర్ ఇంజన్ కా' అని ఓ వ్యక్తిని విలన్ ప్రశ్నించే వాయిస్ బ్యాగ్రౌండ్ లో వినిపిస్తుంది. ఫైర్ ఇంజన్ కి కాదు.. ఆ ఫైర్ కే ఫోన్ చేస్తున్నా' అని అతడు అంటాడు. అదే సమయంలో బాలయ్య పవర్ ఫుల్ ఎంట్రీ ఇస్తాడు. ట్రైలర్ లో జయసుధ, ప్రకాష్ రాజ్, భూమిక పాత్రలు ఆసక్తికరంగా ఉన్నాయి. 

'ప్రాణాలు తీసే అతడి గతం కన్నా.. నా సంస్థల్ని ముందుకు నడిపించే అతడి భవిష్యత్తే నాకు ముఖ్యం' అని జయసుధ చెప్పే డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. ఇక బాలయ్య ఎప్పటిలాగే మాస్ డైలాగ్స్ తో అలరించాడు. 'పార్సిల్ చేయడానికి ఇది దెబ్బతిన్న సింహంరా.. అంత తొందరగా చావదు.. వెంటాడి వేటాడి చంపుద్ది' అని బాలయ్య మాస్ డైలాగ్స్ చెబుతున్నాడు. 

ఈ చిత్రంలో వ్యవసారం గురించి కూడా కీలకమైన సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ లో వేదిక ఎమోషనల్ పెర్ఫామెన్స్ చూపించారు. ఇక సోనాల్ చౌహన్ అందచందాలతో ఆకట్టుకుంటోంది. ట్రైలర్ లో సోనాల్ చౌహన్ బికినిలో కూడా మెరుపులు మెరిపించింది. మొత్తంగా బాలయ్య నుంచి ఫ్యాన్స్ ఎలాంటి చిత్రాన్ని ఆశిస్తున్నారో రూలర్ మూవీ ట్రైలర్ అలా ఉందని చెప్పొచ్చు.