నంద‌మూరి బాల‌కృష్ణ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం `రూల‌ర్‌`. ఫైనల్ గా ఈ సినిమా చిత్రీక‌ర‌ణ నిన్న‌టితో పూర్త‌య్యింది. అన్ని పనులను పూర్తి చేసి సినిమాను డిసెంబ‌ర్ 20న వరల్డ్ వైడ్ గా విడుద‌ల చేస్తున్నారు. మ‌రోవైపు ప్ర‌మోష‌న్ల‌ను కూడా భారీగా చేయ‌డానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. అందులో భాగంగా చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాట‌ల లిరిక‌ల్ వీడియోల‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్నారు.

బాలకృష్ణ కూడా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం స్పెషల్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. సినిమాలో బాలయ్య కనిపించిన లుక్స్ నే బయట ప్రపంచంలో కూడా కంటిన్యూ చేయనున్నాడట. ఇప్పటికే బాలయ్యకే సంబందించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా ఒక ఈవెంట్ కి వెళ్లిన బాలయ్య తన స్టెప్పులతో ఆకట్టుకున్నాడు.

తెలుగు అభిమానులు ఆ వీడియోను ఇప్పుడు తెగ షేర్ చేస్తున్నారు. సినిమాకు బాలయ్య లుక్కే మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ముందు ముందు స్పెషల్ ఈవెంట్స్ తో రూలర్ పై మరింత బజ్ క్రియేట్ చేయాలనీ బాలయ్య కష్టపడుతున్నాడు. మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో బాల‌కృష్ణ రెండు శ‌క్తిమంత‌మైన పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు.

జై సింహా వంటి సూప‌ర్‌హిట్ చిత్రం త‌ర్వాత బాల‌కృష్ణ‌, కె.ఎస్‌.ర‌వికుమార్ కాంబినేష‌న్‌లో రాబోతున్న చిత్రం కావ‌డంతో రూల‌ర్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.  సోనాల్ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్ర‌కాశ్‌రాజ్‌, భూమిక‌, జ‌య‌సుధ‌, షాయాజీ షిండే, ధ‌న్‌రాజ్‌, కారుమంచి ర‌ఘు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ధారులు. రామ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.