ఎపి కార్బైడ్స్ లిమిటెడ్, ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కుటుంబం దాదాపుగా 45 సంవత్సరాల క్రితం పరిశ్రమల రంగంలోకి అడుగుపెట్టినప్పుడు నెలకొల్పిన కంపెనీ. అప్పటినుండి కూడా ఇది మూతబడేవరకు, మూతబడిన తరువాత కూడా ఈ సంస్థను వివాదాలు మాత్రం వీడడం లేదు.  తెలుగుదేశం నాయకుడు, సినీ నటుడు బాలకృష్ణ బంధువుల స్వాధీనంలోకి వచ్చిన తరువాత కూడా, ఈ సంస్థ నష్టాలతో యజమానులకు మాత్రమే కాకుండా, రాష్ట్ర ఖజానాకు కూడా పెద్ద చిల్లు పెడుతూనే ఉంది.

కర్నూలు సమీపంలో ఉన్న ఎపి కార్బైడ్స్ లిమిటెడ్ తరువాత భారత్ అల్లాయ్స్ ఎనర్జీ లిమిటెడ్ గా పేరు మార్చుకున్నా, దాని భవితవ్యం మాత్రం మారలేదు. దాని విద్యుత్ బకాయిలు కూడా 38 కోట్ల 65 లక్షల 8వేల 257 రూపాయలు.   విద్యుత్ శాఖ  సూపరింటెండెంట్ ఇంజనీర్ జి. భార్గవ రాముడు ఈ మూతపడిన సంస్థ బకాయిలు చెల్లించాలని నోటీసు జారీ చేశారు. లేకపోతే, బకాయిలను తిరిగి పొందడానికి దాని ఆస్తులను వేలం వేయాల్సి వస్తుందని నోటీసులు జారీ చేసారు.

ఈ సంస్థ డైరెక్టర్లలో మేనేజింగ్ డైరెక్టర్ బాబు రావు నాదెల్ల, శివ శంకరరావు కాలే, గోపాల భూపాల, రామారావు శ్రీపట్టాభి డైరెక్టర్లుగా ఉన్నారు.   డాక్టర్ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి, ఎపి కార్బైడ్స్ సంస్థలో ప్రధాన వాటాదారులలో ఒకరు.  కార్పొరేట్ రంగంలోకి  రాజశేఖర్ రెడ్డి కుటుంబం అడుగుపెట్టేందుకు ఈ ఇండస్ట్రీని వారు నెలకొల్పడం జరిగింది. అత్యంత ఈ ప్రతిష్టాత్మకమైన ఈ ఇండస్ట్రీని ప్రారంభించేముందు వరకు వారు కేవలం చిన్న, సన్నకారు కాంట్రాక్టర్లుగా మాత్రమే చలామణి అయ్యేవారు.

1983 లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు కర్నూలులోని ఎపి కార్బైడ్స్ కర్మాగారాన్ని లక్ష్యంగా చేసుకుని నోటీసులు జారీ చేసారు.  ఎపి కార్బైడ్‌ పై 5 లక్షల రూపాయలు కట్టాలని  డిమాండ్‌ నోటీసును ప్రభుత్వం ఇచ్చింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ విషయం పెద్ద దుమారానికి తెర తీసింది. విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంపై రాజశేఖర్ రెడ్డి సభను ఎదుర్కోవడానికి ఒకింత ఇబ్బంది పడ్డారు.   ఈ సంస్థ మొదట్లో కార్బైడ్ ఉత్పత్తులను ఉత్పత్తి చేసేది, తరువాత ఫెర్రో మిశ్రమాల తయారీ రంగంలోకి మళ్లింది. పేరు మారినా, తయారీ చేసే ఉత్పత్తులు మారినా కూడా, ఆ సంస్థ గ్రహచారం మాత్రం బాగాలేనట్టుంది.