ఉగాది కానుకగా మెగాస్టార్‌ చిరంజీవి అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చాడు. ఇన్నాళ్లు సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్న చిరు, ఉగాది రోజలు ట్విటర్, ఇన్‌ స్టాగ్రామ్‌లో ఖాతాలను తెరిచాడు. అభిమానులతో తరుచూ ఇంటరాక్ట్ అవ్వటంతో పాటు తమ సినిమాల విశేషాలను కూడా అభిమానులతో షేర్ చేసుకునేందుకు సోషల్ మీడియా చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు సెలబ్రిటీలు. అంతేకాదు పలువురు సెలబ్రిటీ తమ సోషల్ మీడియా పేజ్‌ లలో చేసే పోస్ట్ లకు డబ్బులు కూడా తీసుకుంటున్నారు.

దీంతో సీనియర్‌ తారలు కూడా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇస్తున్నారు. అదే బాటలో చిరు కూడా ఆన్‌లైన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ట్విటర్‌ తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఖాతా తెరచిన చిరు, అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశాడు. అంతేకాదు ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా భయంతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో అభిమానులకు తన సందేశాన్ని సూచించాడు. ఈ విపత్కర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించాడు. చిరు సోషల్ మీడియాలోకి అడుగపెట్టిన కొద్ది గంటల్లోనే ఆయనకు స్వాగతం పలుకుతూ లక్షకు పైగా ట్వీట్స్ రావటం విశేషం.

మెగాస్టార్ చిరంజీవికి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వటంతో అదే రేంజ్‌లో మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న నందమూరి బాలకృష్ణ ఆన్‌ లైన్‌ ఎంట్రీపై చర్చ మొదలైంది. బాలయ్య ఇప్పటికే ఓ ఫేస్‌ బుక్‌ అకౌంట్ ను మెయిన్‌టైన్ చేస్తున్నా.. పెద్దగా ఆన్‌ లైన్‌ యాక్టివ్‌ గా మాత్రం కనిపించడు. అయితే చిరు అఫీషియల్‌ ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో బాలయ్య కూడా ట్విటర్‌, ఇన్‌స్టాలలో ఖాతా తెరిస్తే బాగుంటుందని భావిస్తున్నారు ఫ్యాన్స్‌. చిరు ప్రస్తుతం కొరటాల శివ దర్వకత్వంలో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తుండగా, బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ సినిమాలో నటిస్తున్నాడు.