నితిన్ గత ఏడాది నటించిన ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు నిరాశపరిచాయి. అ..ఆ తర్వాత నితిన్ కు సరైన సక్సెస్ లేదు. దీనితో నితిన్ భీష్మ చిత్రంపై పూర్తిగా ఫోకస్ చేశాడు. భీష్మ చిత్రంతో ఎలాగైనా విజయాన్ని అందుకోవాలని భావిస్తున్నాడు. 

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న భీష్మ చిత్రాన్ని డిసెంబర్ లో క్రిస్టమస్ కానుకగా రిలీజ్ చేయాలని మొదట నిర్మాతలు భావించారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

తాజా సమాచారం మేరకు భీష్మ చిత్రం విడుదల వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. డిసెంబర్ లో బాక్సాఫీస్ వద్ద మీడియం రేంజ్ చిత్రాల తాకిడి ఎక్కువవుతోంది. రవితేజ నటించిన డిస్కో రాజా, సాయిధరమ్ తేజ్ ప్రతి రోజూ పండగే, జార్జ్ రెడ్డి లాంటి చిత్రాలు విడుదలవుతున్నాయి. 

తాజాగా బాలయ్య, కేఎస్ రవికుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం కూడా డిసెంబర్ లోనే రానున్నట్లు టాక్. ఇన్ని చిత్రాల నడుమ భీష్మ మూవీ ని రిలీజ్ చేయడం సరికాదని  నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సంక్రాంతికి ఎలాగు ఖాళీ లేదు. దర్బార్, అల వైకుంఠ పురములో, సరిలేరు నీకెవ్వరు లాంటి భారీ చిత్రాలు విడుదలవుతున్నాయి. 

దీనితో భీష్మ నిర్మాతలు ఫిబ్రవరిలో మహా శివరాత్రి కానుకగా తమ చిత్రాన్ని రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారట. ఫిబ్రవరి 21న భీష్మ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.