అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తొలిసారి భారత పర్యటనకు వస్తుండడంతో సందడి నెలకొంది. ఇండియాని  విజిట్ చేయడానికి ట్రంప్ కూడా చాలా ఆసక్తిగా ఉన్నాడు. కొన్ని రోజుల నుంచి ట్రంప్ సోషల్ మీడియాలో ఇండియా గురించి ప్రస్తావిస్తున్నాడు. 

తాజాగా ట్రంప్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్ర వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. అది కాస్తా వరల్డ్ వైడ్ గా ట్రెండింగ్ గా మారింది. బాహుబలి చిత్రంలో ప్రభాస్ కాలకేయులతో యుద్ధం చేస్తున్న వీడియో అది. ఆ వీడియోలో ప్రభాస్ ని ట్రంప్ లాగా మీమ్ క్రియేట్ చేశారు. ట్రంప్ సతీమణి మిలానియా ట్రంప్ ని శివగామిలాగా చూపించారు. 

ఈ వీడియో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. దీనిపై డోనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. ఇండియా లాంటి గొప్ప స్నేహవంతమైన దేశాన్ని కలుసుకునేందుకు ఆసక్తిగా ఉంది అని ట్రంప్ ట్వీట్ చేశారు. దీనిపై బాహుబలి చిత్ర యూనిట్ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి స్పందించింది. 

'అద్భుతమైన ఇండియాకు వస్తున్న మీకు స్వాగతం.. ది ల్యాండ్ ఆఫ్ బాహుబలి' అని బాహుబలి చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. అదే విధంగా ట్రంప్ ఇటీవల విడుదలైన బాలీవుడ్ చిత్రం 'శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్' చిత్రంపై కూడా ప్రశంసలు కురిపించారు. మొత్తంగా ట్రంప్ ఇండియా పర్యటనపై సెలెబ్రిటీలతో పాటు సామాన్య ప్రజల్లో కూడా ఆసక్తి నెలకొంది.