బాహుబలి చిత్రం విడుదలై చాలా కాలం గడుస్తున్నా ఆ హంగామా మాత్రం ఇంకా తగ్గలేదు. ఆదివారం రోజు బాహుబలి ది బిగినింగ్ చిత్రాన్ని లండన్ లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు బాహుబలి చిత్ర యూనిట్, అభిమానులు కొందరు ఇంగ్లాండ్ ప్రముఖులు కూడా హాజరయ్యారు. 

రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క కనిపించడంతో అభిమానుల కేరింతలతో రాయల్ ఆల్బర్ట్ హాల్ మారుమోగింది. కేవలం హాల్ లోపల మాత్రమే కాదు రాయల్ ఆల్బర్ట్ హాల్ బయట వీధుల్లో కూడా అభిమానుల కోలాహలం కనిపించింది. ఇదిలా ఉండగా బాహుబలి చిత్రాన్ని జపాన్ లో కూడా విడుదల చేయగా అక్కడా భారీ విజయం సాధించింది. జపాన్ అభిమానులు బాహుబలి చిత్రానికి ఫిదా అయ్యారు. దీనితో రానా, ప్రభాస్, రాజమౌళిలకు జపాన్ లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. 

బాహుబలి చిత్ర ఆల్బర్ట్ హాల్ ప్రదర్శనకు కొందరు జపాన్ అభిమానులు కూడా హాజరయ్యారు. లండన్ వీధుల్లో రాజమౌళి కనిపించగానే జపాన్ అభిమానులు ఆయన్ని చుట్టేశారు. చాలా ఉత్సాహంతో జపాన్ ఫ్యాన్స్ రాజమౌళి మాట్లాడుతూ కనిపించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

కొందరు అభిమానులైతే రాజమౌళిని చూసిన ఉత్సాహంతో గంతులేస్తూ కనిపించారు. అనేక ప్రపంచ స్థాయి వేదికలపై బాహుబలి చిత్రాన్ని ఇదివరకే ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ప్రపంచ వేదికలపై ఏ స్థాయిలో గౌరవాన్ని దక్కించుకున్న ఏకైక తెలుగు చిత్రంగా బాహుబలి నిలిచింది.