దేశ వ్యాప్తంగా సినిమాని రిలీజ్ చేయాలంటే బాలీవుడ్ నటులను పెట్టుకోవాలన్నది మనవాళ్ళు పెట్టుకునే మొదటి రూల్. అందుకేనేమో క్రిష్,పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో రూపొందే చిత్రాన్ని మెల్లిగా హిందీ యాక్టర్స్ తో నింపుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో రెండు సినిమాలు చేసిన క్రిష్...అక్కడ తనకు ఉన్న పరిచయాలతో బాలీవుడ్ యాక్టర్స్ ని పిక్చర్ లోకి తీసుకురాటనికి ప్రయత్నాలు మొదలెట్టారు. అందులో భాగంగా తాజాగా ఈ చిత్రంలో రెండు కీలక పాత్రలకు బాలీవుడ్ యాక్టర్స్ ని తీసుకున్నట్టు సమాచారం.

ఆ నటుల్లో ఒకరు అర్జున్ రామ్ పాల్ కావటం విశేషం. హిందీలో అర్జున్ రాంపాల్ కు ఓ ప్రత్యేకమన ఇమేజ్ ఉంది. వర్సటైల్ యాక్టర్ గా పేరున్న అర్జున్ రామ్ పాల్  మనవాళ్లకూ సుపరిచితుడే. ఇప్పటికే హీరోగా, విలన్ గా విభిన్న పాత్రల ద్వారా ఎన్నో ప్రశంశలు అవార్డులు దక్కించుకున్నాడు. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ ఓం శాంతి ఓంలో అర్జున్ రామ్ పాల్ పెర్ఫార్మన్స్ ఎవ్వరూ మర్చిపోరు. ఇక ఈ చిత్రంలో ఎలాంటి రోల్ ఆఫర్ చేశారన్నది సస్పెన్స్.   ఇక రెండో వారు శ్రీలంక నటి జాక్వలిన్ ఫెర్నాండేజ్. సాహోలో ఒక స్పెషల్ సాంగ్ లో ఆడిపాడిన ఈ భామ తెలుగువారికి పరిచితమే. ఆమె కూడా ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర పోషించబోతోందిట.

అందుతున్న సమాచారం మేరకు ఆమెను బ్రిటిష్ సంతతికి చెందిన యువరాణిగా చూపబోతున్నట్టు తెలిసింది. ఈ వివరాలు అన్నీ అఫీషియల్ గా  వెల్లడి కావాల్సి ఉంది.  కీరవాణి సంగీతం సారధ్యంలో వస్తున్న  ఈ మూవీకి సాయి మాధవ్ బుర్ర సంభాషణలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవబోతున్నాయి. వచ్చే ఏడాది విడుదల కానున్న  ఈ సినిమాకు అప్పుడే బిజినెస్ సైతం మొదలైందని వినికిడి. ఏఎం రత్నం నిర్మాణంలో  లిమిటెడ్ బడ్జెట్ తోనే రిచ్ మేకింగ్ తో  పీరియాడిక్ డ్రామా చేయబోతున్నట్టు సమాచారం. తెలంగాణ యోధుడు పండగ సాయన్న కథ అని మీడియాలో ప్రచారం జరుగుతోంది.